ఏకపక్షంగా వ్యవహరించే మొండి మనిషి అని విపక్షాల నుంచి విర్శలను ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, హటాత్తుగా రూటు మార్చారు. చర్చల దారి పట్టారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం కోసం రాజీమార్గం ఎంచుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను తన నివాసంలో తేనీటి విందుకు ఆహ్వానించారు. జీఎస్ టి తోపాటు ఇతర బిల్లులపైనా చర్చించారు.
దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఈ బిల్లు ఆమోదం ఎంత అసవరమో మోడీ వివరించారు. ఈ విషయం మన్మోహన్ కు బాగా తెలుసు. అయితే మూడు విషయాల్లో కాంగ్రెస్ కు అభ్యంతరాలున్నాయి. పన్ను పరిమితి 18 శాతానికి మించి కూడదనేది వీటిలో ముఖ్యమైంది. కానీ ఏ సంఖ్యా లేకుండా బిల్లు ఆమోదించాలని కేంద్రం కోరుతోంది. భవిష్యత్తులో అత్యవసరమైతే 18 శాతానికి మించి పన్ను విధించే వెసులుబాటు ఉండాలనేది సర్కార్ ఉద్దేశం. కాంగ్రెస్ ఇందుకు సిద్ధంగా లేదు. గరిష్ట పరిమితి లేకపోతే 25 శాతం లేదా 50 శాతానికి పెంచినా అడిగే దిక్కుండదని వాదిస్తోంది.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. బంతిని మోడీ కోర్టులోకే నెట్టింది. ప్రభుత్వం కూడా తన వైఖరిని తెలిపింది. కొన్ని రోజుల్లోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఎలాగైనా ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందాలని మోడీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
రాజ్యసభలో బీజేపీకి 48 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు అత్యధికంగా 67 మంది సభ్యులున్నారు. ఇక 12 మంది సభ్యులున్న అన్నా డీఎంకే బీజేపీ పట్ల కాస్త మెతకవైఖరితో ఉండొచ్చు. కాబట్టి మద్దతివ్వ వచ్చని భావిస్తున్నారు, 12 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా బిల్లుకు సై అంటూ సంకేతాలిచ్చింది. 10 మంది సభ్యులున్న బీఎస్పీ ఈ బిల్లుకు తన మద్దతు ప్రకటించింది. వామపక్షాలు, మరికొన్ని ప్రతిపక్షాలు బిల్లుపై పలు అభ్యంతరాలు చెప్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ మద్దతు లేకుండా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందడం దుర్లభం.
కాంగ్రెస్ ను గానీ ఇతర ప్రతిపక్షాలను గానీ బతిమిలాడకుండానే బిల్లుకు ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా ఓ అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ సభలను సమావేశ పరిచి బిల్లుపై ఓటింగ్ పెట్టవచ్చు. లోక్ సభలో ఉన్న భారీ సంఖ్యా బలం కారణంగా ఉమ్మడి సమావేశంలో బిల్లు పాస్ కావడం నల్లేరు మీద నడక. గతంలో ఇలా ఓటింగ్ జరిపిన సందర్భాలున్నాయి. కానీ ఈ పద్ధతిలో ఆమోదం పొందితే అది నిరంకుశ వైఖరి అనే విమర్శలు వస్తాయని మోడీ ప్రభుత్వం ఆనుమానిస్తోంది. అవసరమైతే అదీ చేయవచ్చు. ఈలోగా కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయత్నించాలని మోడీ నిర్ణయించారు. ఈ ప్రయత్నం విఫలమైతే ఉమ్మడి సెషన్ అనే ఆప్షన్ ఎలాగూ ఉంది. అదీ మోడీ ప్లాన్.