వారం రోజుల క్రితం నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను అకస్మాత్తుగా బారీ వానలు ముంచెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆ ప్రాంతాలలో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అటువంటి సమయంలో ఆయన అక్కడికి వెళ్లి అధికారులు తమ పనులు చేసుకోనీయకుండా అడ్డుపడుతున్నారని అప్పుడు వైకాపా నేతలు విమర్శించారు. తుఫాను ఉదృతి తగ్గిన తరువాత తాపీగా ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి తుఫాను వలన రైతులు ఇంతగా నష్టపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు రైతులను పరమార్శించడానికి రావడం లేదని విమర్శిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలంలో తుఫాను వలన దెబ్బ తిన్న చినగొల్లపాలెం గ్రామంలో నిన్న పర్యటించిన జగన్మోహన్ రెడ్డి “జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే అధికారులు కేవలం 18ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. చాలా గ్రామాలలో అధికారులు అసలు ఇంతవరకు పర్యటించనే లేదు. ఇంక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి ఇక్కడికి వచ్చి రైతులను పరామర్శించేందుకు సమయం, ఆసక్తి రెండూ లేవు. రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోంది. కొంతమంది రైతులకు ఎక్కువ, మరికొందరికి చాలా తక్కువ పరిహారం చెల్లిస్తోంది,” అని విమర్శించారు.