మళ్ళీ చాలా రోజుల విరామం తరువాత తెలంగాణా ఏసిబి అధికారులు ఓటుకి నోటు కేసు ఫైలును దుమ్ము దులిపి బయటకు తీసారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొనబడిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అతని అనుచరులు సెబాస్టియన్, ఉదయసింహల, మత్తయ్యల వాయిస్ రికార్డులపై ఫోరోన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) ఎసిబి కోర్టుకు సమర్పించిన నివేదికను తమకు ఈయవలసిందిగా కోరుతూ శుక్రవారం కోర్టులో ఒక మెమో దాఖలు చేసారు. ఎఫ్ఎస్ఎల్ కోర్టుకి సమర్పించిన నివేదికలో అవి నిందితులు మాట్లాడిన మాటలేనని ద్రువీకరించింది. కనుక ఆ నివేదికను తమకు ఇచ్చినట్లయితే దాని ఆధారంగా నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొరకు కోర్టులో ప్రవేశపెడతామని ఏసిబి అధికారులు కోర్టుకి తెలిపారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఇంకా పరీక్షించవలసి ఉంది. కోర్టు అనుమతితో అది కూడా చేయాలని ఏసిబి అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసును పక్కనపడేశారని అందరూ భావిస్తుంటే తెలంగాణా ఏసిబి అధికారులు అకస్మాత్తుగా మళ్ళీ దీనిని బయటకి ఎందుకు తీసారో తెలియదు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవాలనుకొన్నా అది ఈ కేసులో సాధ్యం కాదు. ఈ కేసును కెలికితే మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సి.ఐ.డి. పోలీసులు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసును అటక మీద నుండి దుమ్ము దులుపి బయటకి తీయడం తధ్యం. అప్పుడు మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇవన్నీ తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియవనుకోలేము. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కి ఈమధ్యనే దోస్తీ కుదిరింది. త్వరలో తను జరుపబోయే ఆయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తానని కేసీఆర్ చెపుతున్నారు. ఇటువంటి సమయంలో ఓటుకి నోటు కేసును కెలకడం చాలా ఆశ్చర్యంగానే ఉంది.