హైదరాబాద్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో నిన్న ఉదయం బోరుబావిలో పడిన బాలుడు చనిపోయాడు. బాలుడిని 24 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఇవాళ ఉదయం బయటకు తీశారు. అయితే అతను చనిపోయి ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు.
నిన్న ఉదయం ఆ బాలుడు రాకేష్ పడిపోగానే ఆ వార్త అన్ని టీవీ ఛానల్స్‌లో ప్రముఖంగా ప్రసారం చేయబడటంతో అతనిని బయటకు తీయటానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థల సిబ్బంది బాలుడిని బయటకు తీయటానికి శతవిధాలా ప్రయత్నించారు. స్థానిక ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. జేసీబీలు, భారీ యంత్రాలను సైతం ఉపయోగించారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపించారు. కానీ ఇంత చేసినా చివరకు విషాదేమే మిగిలింది. రాత్రంతో సహాయక కార్యక్రమాలు జరిగిన తర్వాత ఉదయానికి 40 అడుగుల కింద బాలుడు కనపడ్డాడు గానీ, ప్రాణాలు లేవు. సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా నుదిటికి గాయమై ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నోసార్లు జరిగినా ఇవి పునరావృతమవుతూనే ఉన్నాయి. బోర్లు వేసేవారు ఆ గొయ్యిపై రాయిపెట్టటం, ముళ్ళకంచె పెట్టటం వంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇవి చోటుచేసుకుంటున్నాయి. తాజా సంఘటనలోమాత్రం, బోరు వేసిన తర్వాత తాము ఆ గోతిపై రాయి పెట్టేలోపే ఈ దుర్ఘటన జరిగిందని పొలం యజమాని చెబుతున్నారు. ఆ బోరులో నీరు పడకపోవటంతో రెండో చోట బోరు వేద్దామని యజమాని ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది.