హైదరాబాద్: మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే సూపర్‌స్టార్ మహేష్ బాబు మొట్ట మొదటిసారి తన వ్యక్తిగత జీవితంలోని అనేక విశేషాలను బయటపెట్టారు. తన తండ్రి కృష్ణ ద్వితీయ వివాహం, తన తల్లి విశేషాలు, తన జీవితంలోని బ్యాడ్ పీరియడ్‌తో సహా పలు విషయాలను ఒక ఆంగ్లదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
2006లో పోకిరి తర్వాత కొంత కాలం తన జీవితంలో బాగా బ్యాడ్ పీరియడ్ అని మహేష్ చెప్పారు. పోకిరి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ అవటంతో దాని తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని కన్ఫ్యూజన్కు, భయానికి గురయ్యానని తెలిపారు. అప్పుటికి తనకు పెళ్ళి అయ్యి ఒక సంవత్సరమే అయిందని, తన కొడుకుకు ఒక సంవత్సరం వయసని చెప్పారు. అప్పుడే తన అమ్మమ్మతో పాటు, నమ్రత తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్‌తో ఒకేసారి చనిపోయారని తెలిపారు. ఆ సమయంలో తన సినిమాలు(సైనికుడు, అతిథి, ఖలేజా అయి ఉండొచ్చు) కూడా కొన్ని ఆడలేదని చెప్పారు. దీనితో తాను బ్రేక్ తీసుకున్నానని, మూడేళ్ళపాటు తన చిత్రం ఒక్కటికూడా రిలీజ్ కాలేదని తెలిపారు. తాను పని చేయకపోవటంతో తనచుట్టూ ఉన్నవారు భయపడిపోయారని చెప్పారు. అయితే ఆ సమయంలో వ్యక్తిగా తాను ఎదిగానని తెలిపారు. నటుడిగానే కాక, భావోద్వేగపరంగా తాను బలంగా మారానని చెప్పారు.
తన తండ్రికి రెండు పెళ్ళిళ్ళు అయినప్పటికీ ఆయన తమవద్దకు తరచూ వచ్చేవారని, తమకు అవసరం వచ్చినప్పుడల్లా ఆయన తమవద్దే ఉండేవారని తెలిపారు. తన తల్లికి, అమ్మమ్మకు వయసు తేడా 13-14 ఏళ్ళే కావటంతో వారిద్దరూ ఒకే ఏజ్ గ్రూప్‌లాగా, అక్కా చెల్లెళ్ళులాగా ఉండేవారని చెప్పారు. అమ్మమ్మ ఇంటివ్యవహారాలన్నింటినీ చూసేవారని, ఆమె ప్రభావం తమపై బాగా ఉందని తెలిపారు. తాను తెలుగు ఇంటి భోజనాన్నే ఇష్టపడతానని, తన అమ్మమ్మకు తన ఇష్టాలన్నీ బాగా తెలుసని చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయిన తర్వాత ఆ వంటలను తాను తినలేకపోతున్నానని అన్నారు. తన తల్లి చాలా చాలా సింపుల్‌గా ఉండే మహిళ అని, ఆమెకు అవసరాలేమీ ఉండవని చెప్పారు. తన విజయాలతో తన తండ్రి చాలా చాలా సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషాన్ని చూస్తూ తనకు ఇంకా బాగా కష్టపడి పనిచేయాలనిపిస్తూ ఉంటుందని అన్నారు. శ్రీమంతుడు హిట్ అవగానే, తాను ఆయనను కలవటానికి వెళ్ళినపుడు, ఆ సినిమా అక్కడ ఇంత కలెక్ట్ చేసింది, ఇక్కడ ఇంత కలెక్ట్ చేసిందంటూ సంతోషంగా కలెక్షన్ ఫిగర్స్ చెప్పుకొచ్చారని తెలిపారు. తన సినిమా హిట్ అయితే ఆయన బాగా సంతోషిస్తారని, తన సినిమా హిట్ అవటం ఆయనకు బాగా ఇంపార్టెంట్ అని మహేష్ చెప్పారు.
ఎఫైర్స్ గురించి మాట్లాడుతూ, తనకు అంత ఎనర్జీ లేదని మహేష్ అన్నారు. ఒక్కసారి పెళ్ళి అయిపోయి, పిల్లలు పుట్టిన తర్వాత అదే అందమైన జీవితమని చెప్పారు. పరిణతి చెందిన మగవాళ్ళు తమ భార్యనుకాక మరొకరిని ఇష్టపడతారని తాను అనుకోవటంలేదని అన్నారు. నమ్రత గురించి మాట్లాడుతూ, నాలుగేళ్ళ డేటింగ్ తర్వాత 2005లో పెళ్ళి చేసుకున్నట్లు తెలిపారు. ఆమెతో ఉన్నపుడు తను తనలాగా ఉండగలుగుతానని, ఇదే ఆమెలో తనకు నచ్చే అంశమని చెప్పారు. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆమె బాగా చూసుకుంటుందని, ఆ విధంగా తాను లక్కీ అని అన్నారు. తనకు పనిచేయటం ఒక్కటే తెలుసని, డబ్బుల వ్యవహారాలన్నీ ఆమే చూసుకుంటుందని, ఆ విషయంలో ఆమె సమర్థవంతురాలని చెప్పారు. తాను మెతకగా ఉంటానని, జనంతో ఎక్కువగా మంచిగా ఉంటానని ఆమె భావిస్తుందని తెలిపారు. తనను ఎవరైనా హర్ట్ చేస్తే తాను నవ్వి ఊరుకుంటానని, కానీ అలా ఉండకూడదని నమ్రత చెబుతుంటుందని అన్నారు. నమ్రతను ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళ పని అయిపోయినట్లేనని చెప్పారు.
తన సినిమా ఫ్లాప్ అయితే బాగా బాధపడతానని అన్నారు. ఇంట్లోనుంచి బయటకు రానని, రెండు-మూడు నెలలపాటు ఎవరికీ కనపడకుండా ఉండిపోతానని చెప్పారు. 15 రోజులపాటు బాగా డిప్రెస్ అవుతానని, మంచంమీదనుంచి కూడా దిగాలనిపించదని తెలిపారు. ఏదీ తినాలనిగానీ, తాగాలనిగానీ ఉండదని చెప్పారు. తన ముఖంలో ఆ బాధ తెలిసిపోతూ ఉంటుందని వెల్లడించారు. సక్సెస్ తనకు చాలా ముఖ్యమని అన్నారు. పోటీ తత్వం ఉందా అని అడిగితే, బాగా ఉందని మహేష్ అన్నారు. అయితే తాను, చరణ్, ప్రభాస్… అందరికీ, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుందని తాను భావిస్తానని చెప్పారు.
తాను మంచి తండ్రినని మహేష్ అన్నారు. కొడుకు గౌతమ్‌తో, కూతురితో చాలా ఫ్రెండ్లీగా ఉంటానని తెలిపారు. మళ్ళీ ఏమైనా రోల్ ఉందా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడని చెప్పారు. తనకు నలుగురు తోబుట్టువులు ఉన్నారని, సూపర్ స్టార్ సంతామైనప్పటికీ అందరమూ సింపుల్‌గా పెరిగామని, తమ పిల్లలనుకూడా అలాగే పెంచుతామని మహేష్ అన్నారు.