హైదరాబాద్: సాధ్యమైనంత వరకు తన తప్పుని ఎదుటి వారి మీద నెట్టేయడం మనుషులకు అలవాటే. అయితే ఇదే వ్యవహారం ఒక పేరున్న రచయిత కూడా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. రచయిత, దర్శకుల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటే అంత మంచిది. అలా ఇద్దరు కలిసి ఎన్నో మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి అదిరిపోయే ఫలితాలను చూశారు దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోనా వెంకట్. అలాంటి శ్రీనువైట్లకు, రచయిత కోన వెంకట్‌కు మధ్య గతంలో గొడవ రావటం, రాంచరణ్ చొరవతో మళ్ళీ వారు కలవటం తెలిసిందే. అయితే ‘బ్రూస్లీ’ విషయంలోకూడా మళ్ళీ వారిద్దరికీ గొడవ వచ్చిందని ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కోన వెంకట్ శ్రీనుపై పరువునష్టం దావా వేస్తారనికూడా వార్తలొచ్చినప్పటికీ వాటిని కోన తర్వాత ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివాదాన్ని విడమరిచి చెప్పారు.
‘బ్రూస్లీ’ సినిమాకు తాను రాసిన 72 సీన్లను యథాతధంగా తీసుకోలేదని కోన అన్నారు. రాసింది తీస్తే బాగుండేదేమో అనిపించిందని చెప్పారు. కథ కోన వెంకట్ అని వేసి తన పేరు చెడగొట్టారని బాధేసిన మాట నిజమేనని అన్నారు. ఈ విషయంలో తాను కొంచెం ఎమోషనల్ అయ్యానని, అంతకు మించి ఏమీ లేదని చెప్పారు. లీగల్‌గా యాక్షన్ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. ఎంత మంచి అనుబంధం ఉన్నా అప్పుడప్పుడూ గొడవలు పడటం అన్నది కామనేనని చెప్పారు. పదేళ్ళు కలిసి ప్రయాణం చేసిన వారి మధ్య అయినా మనస్పర్థలు రావటమన్నది సర్వసాధారణమని అన్నారు. అలాగే తమమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని చెప్పారు. అయితే ఈ రోజు ఇలా ఉన్న తాము రేపు మళ్ళీ కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చని అన్నారు.
సరే శ్రీను వైట్ల చేయబట్టే బ్రూస్ లీ సినిమా పోయింది ఓకే. మరి వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తే దానికి ఒక రూపం తెచ్చి ఆ సినిమాకు మాటలు రాసిన ‘అఖిల్’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కదా మరి దీని గురించి మాట్లాడడేమీ కోనా సారు అంటూ గొడవలేపుతున్నారు. శ్రీనువైట్ల వల్లనే బ్రూస్ లీ పోయిందంటున్న కోనా మరి తను మాటలందించిన అఖిల్ సినిమా కూడా అంత బాగా ఏం రాలేదు మరి దానికి ఏం సమాధానం చెప్తాడని అంటున్నారు. ఎంత తవ్వితే అంత బయటపడుతుంది అన్నట్టు అనవసరంగా ఇంకా శ్రీనువైట్ల పై కోపాన్ని ప్రదర్శించకుండా ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని భావిస్తున్నారు ప్రేక్షకులు.