హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్‌గా… స్టార్టప్ స్టేట్‌గా అభివృద్ధి చేయటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 16 మాసాల్లోనే టీఎస్ఐపాస్, టీహబ్‌ల ఏర్పాటు, పారిశ్రామికీకరణ, ఐటీ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతే దీనికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో నిర్వహించిన ది ఏంజల్ సమ్మిట్‌లో పాల్గొన్న కవిత ‘ది లాంగ్ రోడ్ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రు.25 వేల కోట్ల పెట్టుబడులతో 1013 కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ఆర్థికరంగ సంస్థలను ఒకేచోట కలుపుతూ ఏంజల్ సమ్మిట్ నిర్వహించటం అభినందనీయమన్నారు.
మహిళలు స్టార్టప్ రంగంలో అంతగా ఆసక్తి చూపించటంలేదని, పేపర్ నుంచి బీఎండబ్ల్యూ కారువరకు అమ్మగలిగే సామర్థ్యం గలవారు స్టార్టప్ రంగంలో సైతం ప్రవేశించాలని పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లో 21శాతం మహిళా స్టార్టప్‌లో ఉండటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి నాన్న కేసీఆర్ తనకు పూర్తి స్వేఛ్ఛనిచ్చి పెంచారని కవిత చెప్పారు. చదువుకునే రోజుల్లో టీవీలు, ట్యూషన్లు, ఐపాడ్లు లేవని, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి ఇష్టం వచ్చిన చోటల్లా ఆడుకునేవాళ్ళమంటూ గత స్మృతులను నెమరువేసుకున్నారు.