హైదరాబాద్: మతఅసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీవ్యవహారాల శాఖల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. మంత్రి ఇవాళ విశాఖపట్నంలో ప్రారంభమైన గ్లోబల్ యూత్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పౌరహక్కులను హరించింది కాంగ్రెస్సేనని అన్నారు. ఇప్పుడు అవార్డులు తిరిగి ఇస్తున్న మేథావులందరూ 1984లో సిక్కులపై దాడులు జరిగినపుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వారందరూ కాంగ్రెస్ వలన ప్రయోజనాలు పొందినవారేనన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జీఎస్టీ బిల్లు గురించి మాట్లాడుతూ, ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని, ఆ పార్టీ అధినేత్రి రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు తెలపటానికి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే దేశ సంపద 2.5 శాతం పెరుగుతుందని చెప్పారు. ఇది ఇప్పటికీ లోక్సభలో ఆమోదం పొందిందని, రాజ్యసభలో తమకు మెజారిటీ లేకపోవటంతో ఆగిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను తాము పరిష్కరించటంతో సోనియా గాంధి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా సాగుతోందని, భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళుతోందని వెంకయ్య నాయుడు అన్నారు.