జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్. విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.6 నూతన చిత్రం ‘మనమంతా’ ఆదివారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే’తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’,’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ముహుర్తపు సన్నివేశాన్ని దేవుని పటాలపై చిత్రీకరించారు. వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను దర్శకుడు చంద్రశేఖర్ యేలేటికి అందించారు. రేపటి నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. వేర్వేరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు భిన్నమైన వ్యక్తుల కథే ఈ చిత్రమని తెలియజేశారు.
మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్పశర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: చంద్రశేఖర్, ఆర్ట్: రవీందర్, కెమెరా: రాహుల్, మ్యూజిక్: మహేష్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.