కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘అమృత’ నగరాల పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రెండు లక్షల ఇళ్ళు, తెలంగాణాకు కేవలం 10,000 కేటాయించడంతో తెరాస నిజామాబాద్ ఎంపి కవిత కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆమె ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఆమె విమర్శలకు తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఇప్పటికే జవాబు ఇచ్చారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వడంతో రాష్ట్ర బీజేపీ నేతల వాదనను దృవీకరించినట్లయింది. ఆయన హైదరాబాద్ లో నిన్న మీడియాతో మాట్లాడుతూ “ఈ అమృత నగరాల పధకం క్రింద 11 పట్టణాలలో రూ. 405.17 కోట్లు వ్యయం అయ్యే గృహాల నిర్మాణానికి మాత్రమే తెలంగాణా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అది కూడా సకాలంలో పంపలేదు. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం దాని ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని, మరో పది కోట్లు అదనంగా వేసి మొత్తం రూ. 415 కోట్లు మంజూరు చేసింది. కనుక తెరాస నేతలు ఈ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. దీనిని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు అర్ధమవుతోంది,” అని బండారు దత్తాత్రేయ అన్నారు.