డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నిన్న ఇద్దరు వ్యక్తులను జమ్మూలో అరెస్ట్ చేసారు. వారిలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజౌరి జిల్లాలో సరిహద్దు భద్రతా దళ నిఘా విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. మరో వ్యక్తి కైఫతుల్లా అలియాస్ మాస్టర్ రాజా కూడా అదే జిల్లాకు చెందినవాడు. అతను పాకిస్తాన్ నిఘా వర్గం కోసం భారత్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను సరిహద్దు భద్రతా దళ నిఘా విభాగంలో పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ ద్వారా రహస్య సమాచారాన్ని సేకరించి, దానిని పాకిస్తాన్ నిఘవర్గాలకు అందిస్తున్నట్లు డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించడంతో వారిరువురి కదలికలపై నిఘా పెట్టారు.అబ్దుల్ రషీద్ నిన్న జమ్మూ నుండి భోపాల్ బయలుదేరుతున్న సమయంలో జమ్మూ రైల్వే స్టేషన్ లో డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అబ్దుల్ రషీద్ వద్ద నుండి కొన్ని రహస్య పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత అతనిచ్చిన సమాచారంతో కైఫతుల్లాను కూడా అరెస్ట్ చేసారు. వారిద్ధరిపై అధికారిక రహస్య చట్టాలు మరియు ఐ.పి.సి సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసారు. వారిరువురే కాకుండా దేశంలో మరి కొందరు వ్యక్తులు, భద్రతా దళాలలో కొంతమంది పాక్ తరపున గూడచర్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్ రషీద్,కైఫతుల్లా ద్వారా మిగిలిన అనుమానితులని కూడా పట్టుకోగలమని భావిస్తున్నట్లు డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.