ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా విజయవాడ మెట్రో రైల్ పనులు ఇంకా ప్రారంభం కాక మునుపే దాని డిజైన్లో మార్పులు చేర్పుల గురించి ఒత్తిళ్ళు, దాని పొడిగింపు గురించి ఆలోచనలు మొదలయిపోయాయి. మహాత్మా గాంధీ కారిడార్ లో పటమట, పోరంకి వద్ద ఏర్పాటు చేయాలనుకొంటున్న మెట్రో రైల్వే స్టేషన్లను వేరేచోటికి మార్చాలని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ సంస్థపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అలాగే విజయవాడలోని కొందరు ప్రముఖ వ్యాపారస్తులు అదే కారిడార్ లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పైగా సాగే మెట్రో రైల్ మార్గాన్ని దానికి 500 మీటర్ల దూరంలో ఉన్న బందరు కెనాల్ పక్కకు మార్చాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఇక అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “ ప్రతీ 1.2 కి.మీ.కి ఒకటి చొప్పున మొత్తం 12 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాము. ఈ మార్గంలో మొత్తం 20 సర్వీసులు నడుస్తాయి. సి.ఆర్.డి.ఏ. అధికారుల అభ్యర్ధన మేరకు సింగ్ నగర్ వరకు సాగే ఈ మెట్రో రైల్ మార్గాన్ని ఆటో నగర్ వరకు, అలాగే రూట్ నెంబర్ ఐదుని అమరావతి మీదుగా సాగే విధంగా పొడిగించడానికి అధ్యయనం చేస్తున్నాము. నగర పశ్చిమ నియోజక వర్గంలో ఒక మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటు చేయవలసిందిగా నగర మేయర్ కోనేరు శ్రీధర్ అభ్యర్ధించారు,” అని ఎన్.రామకృష్ణ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదట గుంటూరు, తెనాలి, విజయవాడలను కలుపుతూ మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించబోతున్న మెట్రో రైల్ నిపుణుడు ఈ.శ్రీధరన్ మెట్రో రైల్ నిర్మాణం, నిర్వహణ రెండూ కూడా లాభదాయకంకావని, ప్రపంచంలో చాలా దేశాలు కేవలం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మెట్రో రైళ్ళను నడుపుతున్నాయని తెలిపారు. కనుక ఆయన స్వయంగా విజయవాడలో అన్ని ప్రాంతాలలో తిరిగి పరిశీలించిన తరువాతనే రెండు కారిడార్లను ఏర్పాటు చేయడం మంచిదని, అవి కూడా అంత లాభాదాయకంగా ఉండబోవని ముందే స్పష్టం చేసారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా విజయవాడ 20 లక్షల కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నందున మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం లాభసాటికాదని చెపుతూ నిధులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. అయినా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉండటంతో జపాన్ కి చెందిన జైక అనే సంస్థ దీనిపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.
హైదరాబాద్ లో సాగుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేర్పుల కోసం రాజకీయ పార్టీలు వాటి నాయకులు చేస్తున్న ఒత్తిళ్ళ కారణంగా ప్రాజెక్టు నిర్మాణం చాలా ఆలస్యమయింది. ఆ కారణంగా దాని నిర్మాణ వ్యయం సుమారు రూ.4, 500 కోట్లు పెరిగిపోయినట్లు వార్తలు వచ్చేయి. ఆ ఆర్దికభారం భరించలేకనో లేక హైదరాబాద్ లో రాజకీయ అవసరాలు, సమీకరణాలు మారినందునో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా మళ్ళీ ముందు అనుకొన్న మార్గంలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించుకొంది. ఈ సంగతులన్నీ తెలిసి ఉన్నప్పటికీ విజయవాడ మెట్రో రైల్ మార్గంలో మార్పులు చేర్పులు, పొడిగింపు గురించి ఆలోచిస్తుండటం చూస్తుంటే అసలు ఈ ప్రాజెక్టును మొదలవుతుందా…లేక ఈ ఒత్తిళ్ళు, కొత్త ఆలోచనల కారణంగా మొదలవక మునుపే అటకెక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.