హైదరాబాద్: పెంపుడు కుక్కే కదా అని ఏమి చేసినా పడి ఉంటుందనుకుందా మహిళ! అరుస్తూ తనకు చిరాకు తెప్పించినందుకుగానూ ఆ పెంపుడు కుక్క మూతిని టేప్‌తో కట్టేసింది. పైగా అదో ఘనకార్యంలో ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టింది. దానిపై అన్నివైపులనుంచీ విమర్శలు, ఫిర్యాదులు వ్యక్తమవటంతో పోలీసులు ఆమెను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. ఇది తెలిసి సదరు మేడమ్ ఇప్పుడు పరారీలో ఉన్నారు.
ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా! అమెరికాలోని ఫ్లోరిడాలో. సదరు మేడమ్ పేరు కేటీ బ్రౌన్. తన చాకొలేట్ లేబ్రడార్ పెంపుడు కుక్కకు టేప్ వేసి చిక్కుల్లో చిక్కుకుంది. టేప్ వేసిన కుక్క ఫోటోను ‘దిస్ ఈజ్ వాట్ హేపెన్స్ వెన్ యు డోన్ట్ షట్ అప్’ అంటూ కేప్షన్ కూడా పెట్టి ఫేస్బుక్లో పెట్టటంతో సమస్య మొదలయింది. అమెరికాలో మానవహక్కులే కాదు జంతు హక్కులకుకూడా ఎంతో ప్రాధాన్యమున్న సంగతి తెలిసిందే. కేటీ ఫోటో 3,70,000 సార్లు షేర్ చేయబడి పోలీసుల దగ్గరకు చేరింది. జంతు ప్రేమికులు పోలీస్ హాట్‌లైన్‌కు నాన్‌స్టాప్‌గా ఫోన్లు చేసి వాయించేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, కేటీ తన చర్యను సమర్థించుకోటానికి ప్రయత్నించింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, తాను ఒక్కనిమిషంపాటు మాత్రమే అలా మూతి కట్టేశానని ఫేస్బుక్లో పోస్టే చేసింది. అప్పటినుంచీ మళ్ళీ కుక్క అరవలేదని, తన పాయింట్ నిజమని తేలిందని పేర్కొంది.