హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ ఇవాళ చిత్తూరు కోర్ట్‌లో లొంగిపోయాడు. న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతనిని తిరుపతి సబ్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే అతనిని తమ రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోర్ట్‌ను కోరారు. చింటూ లొంగుబాటుతో ఈ కేసులో మరికొంత పురోగతి ఏర్పడినట్లయింది. అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ ఈ నెల 17న హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు ఈ హత్యలతో తనకు సంబంధం లేదని, తాను లొంగిపోవాలనుకుంటున్నానని కటారి మోహన్‌కు మేనల్లుడు అయిన చింటూ ఇటీవల మీడియాకు ఒక బహిరంగలేఖ విడుదల చేశాడు. అలాగే ఇవాళ లొంగిపోయాడు. ఇతని లొంగుబాటుతో కేసులో మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశముంది.
ఇదిలాఉంటే ఈ హత్యకేసులో మరో ముగ్గురు నిందితులు మురుగ, పరంధామ, హరిదాస్‌లను పోలీసులు ఇవాళ మీడియాముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పట్టుకున్నామని, చింటూనుకూడా పట్టుకుంటామని చెబుతుండగా, అదే సమయంలో చింటూ కోర్ట్‌కు వెళ్ళి న్యాయవాది సహాయంతో లొంగిపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. బురఖాలు వేసుకుని వచ్చి పక్కా ప్లానింగ్‌తో మేయర్ అనూరాధను, ఆమె భర్త మోహన్‌ను హత్యచేసింది చింటూయేనని పోలీసులు ఇటీవల వెల్లడించారు.