ఆర్.ఎల్.ఎస్.పీ.కి చెందిన ఎమ్మెల్యే బసంత్ కుమార్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారు. కానీ ప్రమాణస్వీకారం చేయక మునుపే ప్రాణాలు కోల్పోయారు. మొట్ట మొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేసిన ఆయన తన తొలిప్రయత్నంలోనే విజయం సాధించగలిగారు. కానీ దేవుడు ఆయనకి ఆయుష్షు ఇవ్వలేదు. బిహార్ లోని హర్లఖీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన బసంత్ కుమార్ గుండెపోటుతో సోమవారం మరణించారు. ఆయన హటాన్మరణం కారణంగా ఈరోజు జరుగవలసిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం రద్దు చేసి, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంతాపం పాటించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఈరోజు శాసనసభ సమావేశమయ్యింది. మొదటిరోజే తమ సాటి సభ్యుడు మరణించడంతో అందరూ చాలా బాధపడ్డారు. కేంద్ర మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ కి చెందిన ఆర్.ఎల్.ఎస్.పీ. తరపున కేవలం ఇద్దరు మాత్రమే గెలిస్తే వారిలో ఒకరు నేడు మరణించారు.