తెలుగుబాషని ప్రజల బాషగా మార్చిన మహనీయులలో గురజాడ అప్పారావు గారు కూడా ఒకరు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!’ అంటూ అందరికీ అర్ధమయ్యే సరళమయిన బాషలో రచనలు చేసి ప్రజలలో చైతన్య పరిచిన మహనీయుడు ఆయన. తన రచనలతో తెలుగు బాషకు పట్టాభిషేకం చేస్తూనే అప్పటి రోజుల్లో సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలను తన రచనల ద్వారా ఎండగడుతూ ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తేవడానికి నిరంతర ప్రయత్నాలు చేసేవారు. ఆయన తన రచనల ద్వారా తెలుగు బాషకు, తెలుగు సాహిత్యానికి, సమాజానికి చేసిన అపురూపమయిన సేవల కారణంగా ఆయన నేటికీ ప్రజల మనసులో సజీవంగా నిలిచి ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఆయన విగ్రహాలు కనబడుతుంటాయి.
నిన్న ఆయన శత వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనను స్మరించుకొంటూ అనేక కార్యక్రమాలు జరిగాయి. వైకాపా కూడా ఆయనను స్మరించుకొని ఘన నివాళులు తెలిపింది. అయితే గురజాడ చిత్రానికి బదులు సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం చిత్రాన్ని ప్రచురించి, దాని క్రింద ‘సాహితీలోకపు ద్రువతార..గురజాడ శతవర్ధంతి సందర్భంగా శతాధిక వందనాలు’ అని ప్రచురించింది. అది చూసినవారు గురజాడ ఎవరో వీరేశాలింగం ఎవరో గుర్తుపట్టలేరా? అని చాలా ఆశ్చర్యపోయారు. తెదేపా నేత నారా లోకేష్ కూడా అది చూసి తనదయిన శైలిలో జగన్మోహన్ రెడ్డికి తన ట్వీటర్ ద్వారా చురకలు వేశారు. “వైకాపా నేతలు అవినీతిపరులను తప్ప మరెవరినీ గుర్తుపట్టలేరు. జగన్! మీరు ప్రచురించిన ఈ చిత్రం వీరేశలింగం గారిది. సారీ గురజాడ గారు,” అనే మెసేజ్ పెట్టారు.