మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి రేపు తెదేపాలో చేరబోతున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోబోతున్నారు. కానీ ఇంతకాలం పార్టీని, చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించిన వారిరువురినీ చంద్రబాబు నాయుడే స్వయంగా పార్టీలో చేర్చుకోవడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వారితో చిరకాలంగా పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు వారి చేరికని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోని పది ఎమ్మెల్యే స్థానాలలో ఏడింటిని వైకాపాయే స్వంతం చేసుకొంది. అలాగే ఎంపీ పదవిని కూడా వైకాపాయే దక్కించుకొంది. కనుక జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, తమ పార్టీ నేతల అభ్యంతరాలను కాదని ఆనం సోదరులను చంద్రబాబు నాయుడు పార్టీలోకి తీసుకొంటున్నారు. తద్వారా జిల్లాలో వైకాపాకు ధీటుగా నిలబడగలదని ఆయన భావిస్తున్నారు. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్న తెదేపా నేతలు అలిగి పార్టీ వ్యవహారాలకి దూరంగా జరగవచ్చును. పార్టీలో సీనియర్ నేతలను కాదని తమను ఆహ్వానించడం వలన ఆనం సోదరులు పార్టీ నేతలను పట్టించుకోకుండా జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నంచవచ్చును. దాని వలన జిల్లాలో పార్టీ బలపడుతుందో లేక ఇంకా బలహీనపడుతుందో ఇప్పుడే ఊహించలేము. కానీ జిల్లాలోని సీనియర్ నేతలను కలుపుకొని వెళ్ళకపోతే పార్టీకి నష్టం తప్పకపోవచ్చును.