హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్ ఆర్ఎస్ఎస్ నాయకులను స్వలింగ సంపర్కులుగా అభివర్ణించారు. ఈ కారణంగానే ఆర్ఎస్ఎస్ నాయకులు పెళ్ళి, పెటాకులు లేకుండా కాలం గడుపుతుంటారని అన్నారు. స్వలింగ సంపర్కం అంశంలో గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్న చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అజమ్ ఖాన్ ఆర్ఎస్ఎస్ నాయకులపై ఈ విమర్శలు చేశారు.
అజమ్ ఖాన్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఖాన్‌కు మైండ్ పోయిందని మండిపడ్డాయి. మరోవైపు ఖాన్ వ్యాఖ్యలపై యూపీకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి, అమితాబ్ ఠాకూర్ లక్నో ఛీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఖాన్ తనను అధికార వ్యవస్థకు ఒక మచ్చగా అభివర్ణించారని, ఆర్ఎస్ఎస్ సభ్యులపైకూడా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తిగా తాను కూడా ఖాన్ వ్యాఖ్యలపై బాధపడ్డానని తెలిపారు. ఖాన్‌పై చర్యలు తసుకోవాలని అభ్యర్థించారు. మేజిస్ట్రేట్ కేసును డిసెంబర్ 15కు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారిపై కూడా అజమ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుఖారి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని వ్యాఖ్యానించారు. అందుకే బుఖారి కుమారుడు హిందూ యువతిని పెళ్ళి చేసుకున్నా, సంఘ్ పరివార్ సంస్థలు మౌనంగా ఉన్నాయని అన్నారు.