ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సత్సబందాలు కలిగి ఉండాలని భావిస్తున్నప్పటికీ ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. పొరుగునున్న నేపాల్ పట్ల భారత్ ఎప్పుడూ స్నేహవైఖరినే ప్రదర్శిస్తూ, దానికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తూవస్తోంది. భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచంలో ఏకైక హిందూ దేశమయిన నేపాల్ మరింత ఎక్కువ లబ్దిపొందుతుందని చాలా మంది ఊహించారు. మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టగానే నేపాల్ వెళ్లి రావడంతో ఆ ఊహలు మరింత బలపడ్డాయి. కానీ నేపాల్ లో ప్రభుత్వం మార్పు, కొత్త రాజ్యాంగం ఏర్పాటు, దానిని అక్కడ స్థిరపడిన కొందరు భారతీయులు వ్యతిరేకించడం, నేపాల్ సరిహద్దులలో ఇద్దరు భారతీయులను నేపాల్ భద్రతాదళాలు కాల్చి చంపడం, మరి కొందరిని అరెస్ట్ చేసి విడుదల చేయడం వంటి సంఘటనలన్నీ ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న సహృద్భావ వాతావరణాన్ని దెబ్బ తీసాయి.
భారత్ ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టగానే నేపాల్ వెళ్లి ఆ దేశంతో సంబంధాలు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తే, నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఖడ్గ ప్రసాద్ ఓలి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోగా, రెండు దేశాల సంబంధాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. భారత్ నుండి నేపాల్ కి వస్తున్న చమురు, నిత్యవసర వస్తువులు, ఇతర సరుకులు సామగ్రిపై భారత ప్రభుత్వం అమలుచేస్తున్న అప్రకటిత నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. భారత్ నుండి సహాయం పొందుతున్నప్పుడు ఆ విధంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఎవరయినా అంగీకరిస్తారు.
భారత్ ఎప్పుడూ కూడా నేపాల్ పట్ల స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తోంది. భారత్ లోని కొందరు ఉన్నతాధికారులు నేపాల్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి ఉండవచ్చును. కానీ దానిని ప్రధాని నరేంద్ర మోడి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చును. కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా భారత్ తో ఘర్షణ వైఖరి అవలంభిస్తోంది. నేపాల్ లోకి సరుకులు సరఫరా కాకుండా భారత్ అప్రకటిత నిషేదాన్ని అమలుచేస్తోందని ఆరోపిస్తూ నేపాల్ లోని కేబుల్ ఆపరేటర్లు భారతీయ టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేశారు. దాని వలన భారత్ కి కలిగే నష్టం ఏమీ ఉండబోదు. కానీ ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తింటాయి అంతే! ఇది రెండు దేశాలకి మంచిది కాదు. కనుక రెండు దేశాల అధికారులు సమస్య ఇంకా తీవ్రతరం కాక మునుపే దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది.