హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖరరెడ్డికి వీర విధేయుడుగా పేరున్నరాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, గత ఎన్నికలలో తెలుగుదేశం గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. జీవితంలో ఏనాడూ తెలుగుదేశం పార్టీని సమర్థించని తాను మొట్టమొదటిసారి, గత ఎన్నికల సమయంలో బాబుకు-జగన్‌కు పోటీ ఏర్పడినపుడు బాబు గెలవాలని కోరుకున్నానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో తనకు మిత్రులు, సన్నిహితులు ఎంతోమంది ఉన్నారని, తన స్థానంలో ఎవరున్నా జగనే గెలవాలని కోరుకుంటారని, అయితే తాను మాత్రం చంద్రబాబు గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించానని చెప్పారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబులాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయితే ప్రయోజనం చేకూరుతుందని భావించినట్లు తెలిపారు. కేంద్రంలో మోడి గెలవబోతున్నాడు కనుక, బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ గెలిస్తే రాష్ట్రానికి ఏ పనైనా జరుగుతుందని అనుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు గెలిచినప్పటికీ, ఆయననుంచి తాను ఆశించినట్లు జరగటంలేదని ఉండవల్లి అన్నారు.
అమరావతిని చంద్రబాబు తన కోటగా పరిగణిస్తున్నరని, తన కోట ఎలా కట్టుకోవాలి అన్నదానిపైనే ఆయన దృష్టిపెడుతున్నారని ఆరోపించారు. 12 చిన్నచిన్న సిటీలు అమరావతి చుట్టూ వస్తాయని చెబుతున్నారని, అంటే చుట్టూ ఉన్న ఊళ్ళను జనం వదిలివెళ్ళిపోవాల్సి ఉంటుందని అన్నారు. అమరావతిని తప్ప మిగతా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని, గోదావరి జిల్లాలనయితే పట్టించుకోవటమే మానేశారని ఆరోపించారు. 30మంది చనిపోయిన పుష్కరఘాట్ దుర్ఘటనపై విచారణ అతీగతీ లేదన్నారు.
బాక్సైట్ తవ్వకాల వివాదంపై మాట్లాడుతూ, చంద్రబాబు శ్వేతపత్రాలు అవాస్తవాలని ఉండవల్లి విమర్శించారు. మంత్రి యనమలతో బాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేయాలని, అనంతరం వాటిపై చర్చ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఇలాగే చేసేవారని చెప్పారు. కేబినెట్లో కొందరు ఆరోపిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డికి బాక్సైట్ కంపెనీల బినామీలు ఉన్నట్లయితే ఆయనపై తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ఉండవల్లి స్పష్టం చేశారు.