బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ అప్పుడే రాజకీయాలలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం మొదలుపెట్టారు. అతను రాష్ట్రా స్థాయి నేతలు తన స్థాయికి సరితూగరని భావించారో ఏమో తెలియదు కానీ ప్రధాని నరేంద్ర మోడి ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. మోడీ పరిపాలన చేయడం మాని ఎప్పుడూ విదేశాలలో తిరుగుతున్నారని, ఆయన కేవలం తన బట్టలు ఉతికించుకోవడానికి మాత్రమే అపుడప్పుడు భారత్ వస్తుంటారని ఎద్దేవా చేసారు. విదేశాలలో తిరగడానికి ఆయనని ప్రజలు గెలిపించలేదనే విషయం గుర్తు పెట్టుకొని దేశాభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుంటుందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించే స్థాయి అతనికి లేకపోయినప్పటికీ ఒక భారతీయ పౌరుడుగా తేజస్వీ ప్రసాద్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ తన తల్లి తండ్రులిద్దరూ 15 ఏళ్ల పరిపాలనలో బిహార్ రాష్ట్రానికి ఎటువంటి దుర్గతి పట్టించారో, మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి నితీష్ కుమార్ ఎంతగా శ్రమించవలసి వచ్చిందో తెలుసుకొంటే బాగుంటుంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి పంచ్ డైలాగ్స్ చెప్పడం వలన త్వరగా పాపులర్ అవవచ్చును. కానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగ ఒక మంచి రాజకీయ నేతగా ఎదగాలనుకొంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేసి పరిపాలనలో మెళుకువలను నేర్చుకొంటే మంచిది.