నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మరోసారి నాని సినిమాకు దర్శకత్వం వహించడం జరుగుతుంది. అయితే సినిమాలో నాని పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. నాని, మోహనకృష్ణ కలయికతో అష్టా-చెమ్మ లాంటి ప్రేమకథ సినిమానే వస్తుందనుకుంటున్నారు ప్రేక్షకులు కాని తెలుస్తున్న వార్తల ప్రకారం సినిమా ఓ హత్యకు సంబందించిన కథతో నడుస్తుందట.
హత్య కేసులో నాని నిండితుడిగా గుర్తించబడటం అది చేసింది తను కాదని చెప్పే ప్రయత్నంలో జరిగే పరిణామాలే సినిమాగా తెరకెక్కిస్తున్నాడట ఇంద్రగంటి మోహనకృష్ణ. 2014లో అంతకుముందు.. ఆ తర్వాత.. అంటూ వచ్చి హిట్ కొట్టిన ఈ దర్శకుడు మరోసారి తన ప్రతిభను ప్రదర్శించనున్నాడు. భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపుమీదున్న నాని వరుసెంట సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం నాని, హను రాఘవపూడి దర్శకత్వంలో జై బాలయ్య (వర్కింగ్ టైటిల్) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయ్యాక ఇంద్రగంటి సినిమా మొదలవుతుంది. దర్శకుడు చెప్పిన కథా, కథనాలు నచ్చే సినిమాలో నటించేందుకు సరే అన్నాడట నాని. దర్శకుడు మోహనకృష్ణ మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న నాని ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో చూడాలి.