ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవాలని పారిస్ వాతావరణ సభ హెచ్చరిస్తుండగానే, ఇప్పటికే తెలుగురాష్ట్రాలు వాతావరణ మార్పులవల్ల సంక్షోభం అనుభవిస్తున్నాయి. తెలంగాణలో చలికాలంలో వేడివాతావరణం కనబడుతుంటే, మరో పక్కన ఆంధ్రప్రదేశ్ లోభారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగువారు ఎక్కువగా ఉండే తమిళనాడులోని చెన్నై మహానగరం వరదనీటిలో మునిగిపోతున్నది.
ప్రపంచమంతా వాతావరణ పెనుమార్పులు సంభవిస్తాయని అంతర్జాతీయ వేదికలపై పెద్దలు ఘోషిస్తునేఉన్నారు… సమావేశాలమీద సమావేశాలు పెట్టుకుంటూనే ఉన్నారు, కానీ ఈలోగా జరగాల్సిన ఉపద్రవాలు జరిగిపోతూనే ఉన్నాయి.
తెలంగాణలో చలి హుళక్కి
తెలంగాణలోని ఈ ఏడాది వాతావరణంలో అసాధరణ మార్పులు కనబడుతున్నాయి. దీపావళి వెళ్లిదంటేచాలు, చలికాలం మొదలైనట్లే. కానీ ఈ సారి పరిస్థితి అలాలేదు. చలికాలంలో చలి పెరగాల్సిందిపోయి, వేడి పెరుగుతోంది. ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. మెదక్ లో పదేళ్లలో ఎన్నడూలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవంబర్ చివర్లో అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 14 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. కానీ 8 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. ఇదే రోజుల్లో హైదరాబాద్ లో సహజంగా చలిపెరుగుతుంటుంది. 16 డిగ్రీలు కనిష్ఠంగా నమోదవుతుంటుంది. కానీ ఇప్పుడది 22 డిగ్రీలకు పెరిగింది. వాతావరణం మేఘావృతంగా ఉండటంవల్లనే ఇలా జరుగుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కారణం ఏదైతేనేం, మారుతున్న వాతావరణంతో సీజన్లు దారితప్పుతోంది. వానాకాలంలో ఎండలు మండిపోయాయి. ఇప్పుడు చలికాలంలోనూ ఇదే పరిస్థితి. మరి వచ్చే ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. సంపన్నదేశాలు చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవించాల్సివస్తున్నది.
ఆంధ్రా, తమిళనాడుల్లో జడివానలు
మరో పక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోవర్ష బీభత్సం పరాకాష్టకు చేరింది. గ్యాప్ ఇవ్వకుండా ఎడాపెడా వాయించేస్తున్న వర్షాలతో అక్కడ ప్రజాజీవనం గాడి తప్పింది. ఇవ్వాళ (డిసెంబర్1) పొద్దుటి నుంచి జోరువాన పడుతోంది. తిరుమలలో జడివానలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. డిసెంబర్ 1 సాయంత్రం నాలుగుగంటలకు వాతావరణశాఖ రిలీజ్ చేసిన శాటిలైట్ చిత్రంలో తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మేఘాల్లో చిక్కుకోవడం కనిపించడంలేదు. చెన్నైలో వర్షంతో పాటుగా నిండిన జలశాయాల్లోని అదనపు నీటిని వదిలేశారు. దీంతో అనేక ప్రాంతాలు వరదపోటెక్కాయి. ఆఫీసలకు వెళ్ళినవారు గమ్యస్థానాలను చేరుకోవడంలో నానా అవస్థలు పడుతున్నారు. పైన వర్షం, క్రింద వరదనీరు. ఇదీ తమిళనాడు, దక్షిణాంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితి.
లక్నోలో మధ్యాహ్నమే కారుచీకట్లు !
ఇదంతా ఇలాఉంటే, ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇవ్వాళ మధ్యాహ్నాం కారుమేఘాలు కమ్ముకుని చీకట్లు ఆవరించాయి. పట్టపగలు టార్చి లైట్లు వేసుకుని వీధుల్లో నడవాల్సివచ్చింది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రమనికాదు, వాతావరణ మార్పులతో దేశమంతా ఇదే పరిస్ధితి. వానపడటం మొదలుపెడితే, 20 నుంచి 40 సెంటీమీటర్ల దాకా కుండపోతగా పడుతోంది. దీంతో డ్రైనేజ్ వ్యవస్థ అంతంతమాత్రంగా ఉన్న అనేక నగరాలు, పట్టణాలు వరదనీటిలో మునిగిపోతున్నాయి. పట్టణాలకంటే పల్లెల్లో వాననీరు త్వరగా భూమిలోకి ఇంకిపోతున్నది. దీంతో అవి త్వరగా కోలుకోగలుగుతున్నాయి. కానీ పట్టణాలు,నగరాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కనీవినీ ఎరుగని వరదలతో చెన్నై నగరవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలనుకుంటున్నారు. మానవతప్పిదాల వల్ల ప్రకృతి గతితప్పితే తలెత్తే పరిస్థితులు ఇప్పటికే కళ్లముందు కనిపిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ పరిస్థితిని చక్కదిద్దాలని అంతర్జాతీయ చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు అగ్రరాజ్యాలు ఏకతాటిపైకి రాలేదు. ఈలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోతూనేఉంది.
– కణ్వస