అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ హీరోగా వచ్చి చాన్నళ్లే అవుతున్నా సరిగ్గా ఒక్క హిట్టు కూడా పడలేదు సరికదా అసలు అతను హీరో అనే విషయాన్నే అందరు మర్చిపోయారు. సుమంత్ సినిమా తీసినా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్తుందో తెలియదన్నట్టు పరిస్థితి తయారయ్యింది. కొద్దికాలంగా గ్యాప్ తీసుకున్న సుమంత్ ఇప్పుడు మళ్లీ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. తనని హీరోగా పెట్టి నిర్మాతలెవరు సాహసం చేయట్లేదని ఇక తానే సొంత బ్యానర్ ఒకటి స్థాపించి సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యాడు ఈ హీరో.
ప్రస్తుతం సుమంత్ బాలీవుడ్లో సంచలన విజయం దక్కించుకున్న ‘విక్కీ డోనార్’ సినిమా రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నిర్మించిన సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదు చేసుకుని నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో సుమంత్ హీరోగా చేస్తూ నిర్మించడం విశేషం. ఇప్పటికే ఆ సినిమా కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చే పనిలో పడ్డారట చిత్ర యూనిట్.
మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే బాలీవుడ్ ప్రేక్షకుల ఆలోచన విధానం వేరు కాబట్టి వీర్య దానం అక్కడ ప్రేక్షకులు అంగీకరించగలిగారు కాని మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా అందుకుంటారన్నది ఆలోచించదగ్గ విషయం. మరి నిర్మాతగా మారిన మొదటి సినిమానే ప్రయోగం చేస్తున్న సుమంత్ చూస్తుంటే అభిరుచి గల నిర్మాతగా హిట్లు కొట్టేట్టుగానే ఉన్నాడు.