చెన్నై ఉన్నట్టుండి మహాసముద్రంలా మారిపోయింది. నిన్నటి నుంచి ఒక పక్క ఎడతెరపలేకుండా వర్షం పడుతుండగా, మరో పక్క అతిపెద్ద రిజర్వాయర్ చెంబరంబాక్కం నుంచి వరదనీరు ఉప్పెనలా ముంచెత్తడంతో చెన్నైలో చాలాభాగం నీటిలో మునిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా బాధితులు పంపిస్తున్న ఫోటోలు, మేసేజ్ లు హృదయవిదారకంగా ఉన్నాయి. వృద్ధులు, పిల్లల పరిస్థితి చాలాచోట్ల ఆందోళనకరంగా ఉంది. పేషెంట్స్ ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లడం సాధ్యపడటంలేదు. చెన్నైవాసుల కన్నీళ్లు వరదనీటిలో కలసిపోతున్నాయి.
సోషల్ మీడియాలో….
`నా భార్యను కాపాడండి. తను ఆఫీసులో ఉంది. నేను ఇంటిదగ్గర ఏడాది వయసున్న పాపాయితో ఉన్నాను. ఆమె ఇంటికి చేరేలా, ప్లీజ్ ఎవరైనా హెల్త్ చేయరూ..’ – ఒక తండ్రి ఆవేదన.
`మేము వరదనీటిలో ఉన్నాము. ఇంట్లో వృద్ధులున్నారు. ఎవరైనా ప్లీజ్ బోట్స్ పంపించరూ…’ అంటూ మరో ట్వీట్.
`మేము Guindy race cource road bridge దగ్గర రెండున్నర గంటలుగా ట్రాఫిక్ లో నిలిచిపోయాము. ఆఫీసు నుంచి బయలుదేరి 5 గంటలవుతుంది. ఎప్పుడు ఇంటికి చేరుతామో తెలియదు. ఓ గాడ్… ‘ అంటూ ఒక ఉద్యోగి ఫేస్ బుక్ లో పెట్టిన మెసేజ్.
`మా ఇంట్లోకి నీళ్లొచ్చాయి. రోడ్లు చెరువులాగా మారాయి’ సినీ పాటల రచయిత భువనచంద్ర రాజు పెట్టిన మెసేజ్.
`ఏడాది పిల్లాడితో ఉన్నాను. మమ్మల్ని కాపాడండి, ప్లీజ్…’ అంటూ ఓ తల్లి ఆవేదన.
`ఆఫీసుకు వెళ్ళిన మా అబ్బాయి ఇంకా తిరిగిరాలేదు. మొబైల్ ఫోన్ పనిచేయడంలేదు. కరెంట్ లేదు. వాడికోసం ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేను’ ఒక తల్లి మనోవేదన.
ఎటు చూసినా నీళ్లే….
చెన్నై ఆకస్మిక వరదలతో దేశమంతా విస్తుపోయింది. చెన్నై మహానగరానికి ఎక్కువ మొత్తంలో మంచినీళ్లు అందించే చెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి అదనపు నీరు వదిలిపెట్టేయడంతో నగరంలోని చాలాప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. చూస్తుండగానే పేటలకు పేటలు మునిగిపోయాయి. ఇవ్వాళ (డిసెంబర్ 1) రాత్రి 8-30 గంటలతో ముగిసిన లెక్కప్రకారం గత 24 గంటల్లో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికితోడు అడయార్ ప్రాంతంలోకి రిజర్వాయర్ నీరు వదిలేయడం పరిస్థితి మరింత దారుణంగా మారింది. నంవబర్ 17న ఒక్క రోజులో 25 సెంటీమీటర్ల వర్షం పడినప్పటి నుంచి చాలా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండిపోయాయి.
నాలుగురోజులపాటు భారీ వర్షాలే :వాతావరణ శాఖ
తమిళనాడు, పుదుచ్చేరిల్లో మరోనాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం పడవచ్చని భారతవాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే వానలు, వరదల కారణంగా 188 మంది ప్రాణాలుకొల్పోయినట్లు వార్తలందాయి. డిసెంబర్ 7న ప్రారంభం కావాల్సిన హాఫ్ ఇయర్లీ పరీక్షలను స్కూల్స్ వాయిదావేసుకున్నాయి. పరిస్థితి చక్కబడేవరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండండి
ఇక విమానాశ్రయం రన్ వే వద్దకు కూడా నీళ్లు చేరాయి. వాతావరణం సరిగాలేని కారణంగా విమాన సర్వీసులను రద్దుచేశారు. ఇవ్వాళ ఉదయం కొలొంబోకి బయలుదేరిన విమానం మళ్ళీ వెనక్కి తిరిగివచ్చేసింది. రైళ్లు, బస్సు సర్వీసులను నిలిపివేశారు. వరదల్లో చిక్కుకున్న చెన్నై వాసులను కాపాడటంకోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. మోటారు వెహికల్స్ మీద వెళ్ళేవారి పరిస్ధితి దయనీయంగా ఉంది. కార్లు మునిగిపోతున్నాయి. టూవీలర్స్ కొట్టుకుపోతున్నాయి. కొన్నిచోట్ల వరదనీరు మొదటిఅంతస్థుదాకా వచ్చేసింది. దీంతో అనేక భవనాలకు పైకప్పు మాత్రమే కనిపిస్తోంది. పెద్దపెద్ద చెట్లు మునిగిపోయాయి. భయంకరమైన పరిస్థితి తలెత్తింది. విద్యుత్ సరఫరా నగరంలో నిలిపివేశారు. దీంతో నగరం చీకట్లో మగ్గిపోతున్నది. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చెన్నైవాసుల కష్టాలు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా, టివీల ద్వారా దేశప్రజలకు తెలుస్తున్నాయి. నేషనల్ మీడియా చాలాసేపు చెన్నై వరదల గురించి ప్రస్తావించకపోవడంపై చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. తెలుగు ఛానెల్స్ కూడా అదేదారిన నడిచాయి. అయితే సోషల్ మీడియా మాత్రం చెన్నైవాసులకు తోడుగా నిలిచింది. చెన్నై వాసులు మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారికి మనమంతా ఉన్నామని ధైర్యం చెప్పాలిన పరిస్థితి ఇది.
– కణ్వస