చెన్నై నగరాన్ని మళ్ళీ బారీ వానలు ముంచెత్తాయి. నగరంలో లోతట్టు ప్రాతాలన్నీ నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నపటికీ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో చెన్నైలో పరిస్థితులు ఇంకా దిగజారుతూనే ఉన్నాయి. ప్రముఖ నటుడు సిద్దార్ధ ఇంటిలోకి కూడా నీళ్ళు వచ్చి చేరడంతో అతను కూడా వేరే ఇంటికి మారవలసి వచ్చింది.
ఆ ఫోటోలను ట్వీటర్ లో పోస్ట్ చేసి “నావంటి వారి పరిస్థితే ఈవిధంగా ఉంటే, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును,” అని మెసేజ్ పెట్టారు. అప్పుడే అతనికి ఈ పరిస్థితి తీవ్రత, ప్రజలు పడుతున్న బాధలు అర్ధమయ్యాయి. ఇక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా ఆయన కూడా సహాయ చర్యలకి నడుం కట్టారు. తను స్వయంగా పాల్గొనడమే కాకుండా తన స్నేహితులని, ప్రజలని అందరినీ కూడా సహాయ చర్యలలో పాల్గొనమని ట్వీటర్ ద్వారా మెసేజ్ పెట్టారు. సహాయ చర్యలలో పాల్గొనదలచినవారు, వాహనాలు, ఇళ్ళు ఇవ్వదలచినవారు తనని, తన స్నేహితుడు ఆర్.జె.బాలాజీని సంప్రదించాలని కోరారు.
ఇప్పటికే ఆయన కొంతమందిని తన కార్యాలయం, ఇళ్ళలో ఆశ్రయం కల్పించారు. ముంపు ప్రాంతాలలో చిక్కుకొన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, వారిని ఉంచేందుకు అపార్టుమెంటులు ఉన్నవారు ముందుకు రావాలని అభ్యర్ధించారు. అందుకు ప్రజల నుండి మంచి స్పందనే వస్తోంది. ఈరోజు నుండి సిద్దార్ధ అతని స్నేహితులు కలిసి ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టబోతున్నారు. సిద్దార్ధ చేస్తున్న ఈ మంచి పనికి అందరూ తమ శక్తిమేర సహకరిస్తే బాగుంటుంది. మిగిలిన నటులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలు, రాజకీయ నాయకులు వారి పార్టీలు కూడా ఈ సహాయ పునరావాస చర్యలలో పాల్గొనవలసిన బాధ్యత ఉంది.