తెదేపా ప్రభుత్వం నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య యాత్రలు మొదలుపెట్టింది. గత 18నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడానికి ఈ యాత్రలు చేపట్టింది. కానీ వైకాపా నేత అంబటి రాంబాబు ప్రభుత్వం ఏమి సాధించందని ఈ జనచైతన్య యాత్రలు చేపడుతోంది? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలను ఎలాగూ అమలుచేయలేకపోయారు. కనీసం పరిపాలన అయినా సక్రమంగా చేయలేకపోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, పరిశ్రమలు మొదలయిన వాటిపై ప్రభుత్వం ప్రకటించిన పాలసీలన్నీ అధికార పార్టీలో నేతలకి లబ్ది చేకూర్చేవిగా ఉన్నాయి తప్ప పేద, సామాన్య ప్రజలకు ఉపయోగపడటం లేదని విమర్శించారు. తెదేపా నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తూ తనను ప్రశ్నించినవారిని అణచివేస్తోందని ఆరోపించారు. కాపుసామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం లేవదీయబోతున్నందునే ముందు జాగ్రత్తగా ఆ వర్గానికి రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు తప్ప నిజంగా వారిపై ప్రేమ చేత కాదని అంబటి రాంబాబు ఆరోపించారు. “జన చైతన్య యాత్రలతో ప్రజలను మేల్కొలుపుతామని చెపుతున్నారు. కానీ ప్రజలు మేల్కొనే ఉన్నారు. అధికార పార్టీ నేతల, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిని, ప్రభుత్వ పనితీరుని నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. కనుక అధికార పార్టీ నేతలే ముందు మేల్కొనవలసి ఉంది,” అని అంబటి రాంబాబు అన్నారు.