హైదరాబాద్: నెల్లూరు జిల్లా రాజకీయ దిగ్గజాలు ఆనం బ్రదర్స్ పచ్చకండువాలు కప్పేసుకున్నారు. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి ఇవాళ విజయవాడలో సీఎమ్ క్యాంప్ ఆఫీస్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదగా ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశీస్సులతో నెల్లూరుజిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయాలలో ఉన్నామని, అయితే రాష్ట్ర విభజన చేసిన తీరుతో ఆ పార్టీమీద మనసు విరిగిపోయిందని అన్నారు. విభజనతో రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను పార్టీ హైకమాండ్ దెబ్బ తీసిందని చెప్పారు. రాజధానికూడా లేని దుర్భర పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారని అన్నారు. తాము ఎన్నిసార్లు చెప్పినా హైకమాండ్ పట్టించుకోలేదని చెప్పారు. ఓటమి తెలిసినప్పటికీ పార్టీని వీడలేదని, పోటీ చేశామని అన్నారు. ఈ 18 నెలల్లోకూడా కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాపం పడటంలేదని చెప్పారు.
ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ, అధికారం పదవులకోసం టీడీపీలో చేరటంలేదని అన్నారు. అన్నీ ఆలోచించే పార్టీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు బూటకపు మాటలు చెప్పటంలదేని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో 30 ఏళ్ళు పడుతుందని, ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా బాబుకు మాత్రమే ఉందని, అందుకే ఆయనకు నైతిక మద్దతు ఇచ్చేందుకు పార్టీలో చేరినట్లు తెలిపారు. తాము చేరటంతో తమ అనుచరులు కూడా చేరినట్లేనని అన్నారు. జగన్పై తీవ్రంగా స్పందించారు. జగన్ బంగారంలాంటి తన తండ్రి రాజశేఖరరెడ్డిని కూడా చెడగొట్టాడని, అతనికి రాజశేఖరరెడ్డి కుమారుడినని చెప్పుకునే అర్హత లేదని వివేకా వ్యాఖ్యానించారు. వైసీపీ దొంగలు, రౌడీల పార్టీ అన్నారు.