ఆనం సోదరులు ఇద్దరూ ఈరోజు తెదేపా ‘అధికార కండువాలు’ కప్పుకొన్నారు. కానీ తాము పదవులు, అధికారం కోసమో అధికార పార్టీలో చేరలేదని, కేవలం భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలనే గొప్ప సంకల్పంతోనే కండువాలు మార్చుకోవలసి వచ్చిందని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా శ్రమనుకోకుండా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి కూడా ప్రజలకు విదమరిచి చెప్పారు. ఓడిపోతామని తెలిసినా పార్టీ పరువు కాపాడటం కోసమే ఎన్నికలలో పోటీ చేసామని చెప్పుకొచ్చేరు. ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చడమే రాజకీయాల ప్రదానోదేశ్యం అని తాము విశ్వశిస్తున్నామని తెలిపారు. వైకాపా ఒక దొంగలు, రౌడీల పార్టీ అని అటువంటి పార్టీలో చేరాలని తామెన్నడూ భావించలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెడగొట్టారని అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఆనం రామనారాయణ రెడ్డి నోటి వెంట ఇటువంటి ఆణిముత్యాలు రాలిపోతుంటే మీడియావాళ్ళు సైతం వాటిని ఏరుకోలేక కంగారుపడ్డారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారని, దాని వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆనం వారే స్వయంగా చెప్పుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను మార్చాలని భావించినప్పుడు ఇదే ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ మరి కొందరు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీలు పడ్డారు, తప్ప రాష్ట్ర విభజన జరుగుతున్నందుకు కించిత్ బాధ పడలేదు. అయితే ఆ పోటీలో బొత్స సత్యనారాయణ ముందంజలో ఉండటం వలన ప్రజాగ్రహం పూర్తిగా ఆయన మీదకి మళ్లడంతో ఆనం పెద్ద ఇబ్బంది లేకుండా బయటపడగలిగారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర విభజన వలన నష్టం జరగిందని మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు.
కాంగ్రెస్ తప్పు చేసిందని భావిస్తున్నప్పుడు ఇంత కాలం అదే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఎందుకు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని ఇప్పుడు తాపీగా చెపుతున్న పెద్దమనిషి కాంగ్రెస్ తరపున ఎందుకు ఎన్నికలలో పోటీ చేసారు? అనే ప్రశ్నలకు జవాబులు ఆయన చెప్పక పోవచ్చును కానీ అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పదవులు, అధికారం తనకి తృణప్రాయం అని చెప్పుకోవడం గొప్ప విషయమే. అది కూడా తన కోసం కాక భావితరాల కోసం పార్టీ మారానని చెప్పుకోవడం మరీ అద్భుతంగా ఉంది. బహుశః మన భారతదేశంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచించే ఏకైక రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి ఒకరేనేమో?
తెదేపాలో చేరక మునుపు వైకాపాలో చేరేందుకు ఆనం సోదరులు ప్రయత్నించినట్లు పత్రికలలో వార్తలు వచ్చేయి. కానీ ఇప్పుడు అదే పార్టీని దొంగల పార్టీ, రౌడీల పార్టీ అంటున్నారు. మళ్ళీ అదే దొంగల పార్టీలో నుండి చాలా మంది త్వరలోనే తెదేపాలో చేరబోతున్నారని చెపుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఆయన మొదట తెదేపా అధికారంలో ఉన్నప్పుడు దానిలో ఉంటూ పదవులు, అధికారం అనుభవించారు. అది ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీలోకి మారి మళ్ళీ మంత్రి పదవులు అనుభవించారు. మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోగానే ఇప్పుడు అధికారంలో ఉన్న తెదేపాలో చేరిపోయారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెదేపా ఓడిపోయి మరేదో పార్టీ నెగ్గితే మళ్ళీ దానిలోకి జం అవడం ఖాయం. ఎందుకంటే భవిష్యత్ తరాలను కాపాడుకోవలసిన బాధ్యత ఆయన భుజాలపైనే ఉంది మరి!