హైదరాబాద్: గతంలో జైలు శిక్ష అనుభవించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దేశంలో జైళ్ళ పనితీరులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ రూపొందించాడు. ఫీనిక్స్(పునరుజ్జీవం పొందే పక్షి) అనే ఈ సాఫ్ట్‌వేర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ళలో ఉపయోగించటానికి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తన ఆమోదాన్ని తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను నాలుగు ఐటీ కంపెనీలు, వివిధ రాష్ట్రాలలోని జైళ్ళలో ఇన్‌స్టాల్ చేయటంకోసం, కొనుగోలు చేశాయి.
భార్య ఆత్మహత్య చేసుకోవటానికి కారణమనే ఆరోపణతో యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన అమిత్ మిశ్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2013లో జైలు పాలయ్యాడు. జైలులో ఉన్న సమయంలో లోలోపల కుమిలిపోవటం కాకుండా, జైళ్ళ పనితీరును అధ్యయనం చేశాడు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారుచేశాడు. ఇది మూడు లెవల్స్‌లో పనిచేస్తుంది. మొదటి లెవల్‌లో జైలులో ఉండే నిందితులు, ఖైదీలు, వారి చిరునామాలు, వారిమీద ఉన్న కేసులు, ఆ కేసుల స్టేటస్ వంటి సమాచారమంతా ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. రెండో లెవల్ జైళ్ళ పాలన, నిర్వహణలకు సంబంధించినది. ఒక్కసారి నిర్దేశిత జైల్ సమాచారాన్ని దానిలోకి ఎక్కిస్తే ఇక ప్రతిసారీ దానిలోకి డేటాను ఎంటర్ చేస్తుంటే సరిపోతుంది. మూడో లెవల్‌లో ఖైదీలు, నిందితులు తమ కేసుల, శిక్షల, వ్యక్తిగత జైలు జీవిత సమాచారాన్ని ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అమిత్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలు తర్వాతి కాలంలో వీగిపోవటంతో అతను ప్రస్తుతం గురగావ్‌లో ఒక ఐటీ కంపెనీకి అధినేతగా పనిచేస్తున్నాడు.