కొద్దిరోజులుగా చెన్నై నగరాన్ని ప్రళయంతో ముంచేస్తున్న వర్షం కారణంగా చాలా మంది నిరాశ్రయులుగా మారారు. ఎన్ని ముందుజాగ్రత్త చర్యలు చేస్తున్నా వర్షం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా వరకు ఆస్థి నష్టం జరిగింది. కొద్దిరోజులుగా పడుతున్న ఈ భీకరమైన అకాల వర్షాల వల్ల రవాణా వ్యవస్థ కూడా అస్థవ్యస్థమయ్యింది. తమిళనాడు ప్రభుత్వం వర్షం వల్ల కలిగిన నష్టాన్ని పరిష్కరించే పనులు చేపడుతుంటే వారికి తాము కూడా అండగా ఉన్నామంటూ సిని పరిశ్రమకు చెందిన వారు కూడా ముందుకొస్తున్నారు.
ఇప్పటికే విలక్షణ నటుడు సూర్య వర్షం వల్ల రోడ్డున పడ్డ భాదితులకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను సి.ఎం సహాయ నిధికి నడిగర్ సంగం ద్వారా అందించడం జరిగింది. ఇక లారెన్స్ కూడా 10 లక్షల రూపాయలను నడిగర్ సంగానికి అందించాడట. అయితే టాలీవుడ్ పరిశ్రమ నుండి నందమూరి సోదరులు ఇద్దరు కలిసి 15 లక్షల రూపాయలు సి.ఎం సహాయ నిధికి అందించారని సమాచారం. చెన్నై భాదితులకు టాలీవుడ్ నుండి ముందు స్పదించింది మాత్రం బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు.. స్వతహాగా ముందే స్పందించిన సంపూర్నేష్ తన వంతు సాయంగా 50 వేల రూపాయల చెక్ అందచేశాడు.
కోలీవుడ్ సిని పరిశ్రమకు చెందిన మిగతా వారు కూడా తమ సహాయాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారట. ఇప్పటికే సిద్ధార్థ్ వినూత్నంగా ఆశ్రయం లేని వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి టాలీవుడ్ పరిశ్రమ నుండి ఇంకెంత మంది చెన్నై భాదితులను రక్షించేందుకు ముందుకు వస్తారో చూడాలి.