ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ అమరావతి పుణ్యామాని చాలా ‘జిగిరీ దోస్తులు’ అయిపోయారు. వారు అలాగే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీతో సహా అందరూ కోరుకొంటున్నారు. తమ దోస్తీని కంటిన్యూ చేయడానికి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి డుమ్మా కొడితే, కేసీఆర్ కూడా దానిని కంటిన్యూ చేస్తూ తను చేయబోయే ఆయుత చండీయాగానికి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించబోతున్నట్లు ప్రకటించేశారు. బహుశః చంద్రబాబు నాయుడు దానికి రిటర్న్ గిఫ్ట్ గా త్వరలో తెలంగాణాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో, అవసరమయితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా వేలు పెట్టబోనని చాలా స్పష్టమయిన సంకేతాలు ఇచ్చేసారు.
అయితే వారి దోస్తీకి ఓటుకి నోటు కేసు ఒక్క అడ్డుగోడలా తయారయింది. చంద్రబాబు నాయుడు మూడు నెలల విరామం తరువాత హైదరాబాద్ లో అడుగుపెట్టగానే మళ్ళీ అది భూతంలాగ బయటకి రావడంతో ఎవరికి తోచిన బాష్యాలు వారు చెప్పుకొంటున్నారు. ఇంతకీ ఈ కేసుకి ముగింపు ఎప్పుడు…ఏమిటి? అనే ప్రశ్నలకు ఖచ్చితమయిన జవాబు ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ అది వారిరువురి దోస్తీని బట్టి ఉంటుందని మాత్రం అందరూ భావిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇదే విధంగా తన దోస్తీ కోసం త్యాగాలు చేయడానికి సిద్దమయితే, ఆ ‘ఓ..నో..భూతం’ కూడా కనబడకుండా మాయమయిపోవచ్చును. లేకుంటే అప్పుడప్పుడు ఇలాగే పలకరిస్తూ ఉండవచ్చును.
తెలంగాణ ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్ బహుశః ఇదే ముక్కను మరోలా చెప్పారేమో అనిపిస్తోంది. ఈ ‘ఓ..నో..సీరియల్’ దశలవారిగా అంటే మరికొన్ని ఎపిసోడ్స్ సాగుతుందని చెప్పారు. కోర్టు వద్ద ఉన్న ఫోరెన్సిక్ నివేదిక కోసం మెమో దాఖలు చేసామని, అది చేతికి వస్తే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఇదివరకు ఈ కేసు మొదలయినప్పుడు ఏసిబీ అధికారుల వేగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు అదే ఏసిబీ అధికారులు దశలవారిగా కేసు విషయంలో ముందుకు వెళతామని చెపుతున్నారు. బహుశః ఆ దశలకి, దోస్తీకీ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందనుకోవాలేమో?