మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న సినిమా అ..ఆ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఉపశీర్షిక. నితిన్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ ‘ప్రేమం’ కథానాయిక అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. కుటుంబ కథతో వస్తున్న ఈ సినిమాలో ప్రఖ్యాత దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తన సినిమాల్లో ప్రతి ఒక్క పాత్రకి మంచి గుర్తింపునిచ్చే త్రివిక్రమ్ అ..ఆ సినిమాలో విశ్వనాథ్ గారికి మంచి పాత్ర రాసుకున్నాడట.
సహజంగా రోజుకు లక్ష డిమాండ్ చేస్తున్న విశ్వనాథ్ గారు ఈ సినిమాకు ముందు లక్ష అని చెప్పినా తన పాత్ర షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రోజు రెండు లక్షలు ఇస్తేనే అని పట్టు పట్టాడట. పోనీ సీనియర్ దర్శకుడు అందునా పెద్దాయన కదా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన అడిగినంతా ఇద్దామని చూసినా షూటింగ్ టైంలో సినిమా ఫైనాన్సర్స్ విశ్వనాథ్ గారితో కాస్త పద్ధతి తప్పి మాట్లాడారట. దానికి ఇబ్బంది పడ్డ విశ్వనాథ్ గారు సినిమా నుండి నిష్క్రమించినట్టు తెలుస్తుంది.
ఈ విషయం మీద దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేసేదేమీ లేక ఆ పాత్రకు సీనియర్ నటుడు గిరిబాబుని పెట్టుకున్నారట. అసలు ఆయన్ను తీసుకోకుండా చేస్తే బాగుండేది ఆయనకు అనుకున్న పాత్రను వేరే వారికి ఇచ్చి ఆయన్ను అవమానపరిచినట్టే అని అభిప్రాయపడుతున్నారు విశ్వనాథ్ గారిని అభిమానించే వారు. మరి మొత్తానికి ఈ విషయం గురించి అసలు దర్శకుడు త్రివిక్రమ్ ఏమని స్పందిస్తాడో చూడాలి.