హైదరాబాద్: చెన్నైలో గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాలతో తల్లడిల్లుతున్న నగర ప్రజలకు ఇవాళ కాస్త ఊరట లభించింది. కుండపోత వర్షం ఇవాళ కొద్దిగా తెరపినిచ్చింది. అయితే ప్రజల కష్టాలకు మాత్రం తెరపిలేకుండా పోయింది. వర్షం ఆగటంతో పాలు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసరాలకోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అయితే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు బ్యాంకులు, ఏటీఎమ్‌లు వరదనీటిలో మునిగిపోవటంతో లావాదేవీలు నిలిచిపోయాయి. దీనితో నగదు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వరదనీరు ఇప్పుడప్పుడే తొలగిపోయేటట్లు కనిపించటంలేదు. నగరంలోని అనేక నాలుగు నదులు, వివిధ సరస్సులు పొంగి పొర్లుతుండటంతో వీధుల్లోనుంచి వరదనీరు బయటకి వెళ్ళలేకపోతోంది. మరోవైపు, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు, వరదల కారణంగా చనిపోయినవారి సంఖ్య 269కు చేరినట్లు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ పార్లమెంట్లో ప్రకటించారు.
వందల కాలనీలు ఇంకా నీటిలోనే మునిగిఉన్నాయి. ప్రభుత్వ సహాయక శిబిరాలలో వేలమంది తలదాచుకుంటున్నారు. ఆవడి-పూనమల్లి హై రోడ్ మీద ఒక వంతెన నిన్న మధ్యాహ్నం కూలిపోయింది. ఆ వంతెన కింద నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి వంతెనకున్న స్తంభాలు కూలిపోయి వంతెన పడిపోయింది. పలుచోట్ల ప్రజలు తమ తమ ఇళ్ళలోనో, సురక్షిత ప్రాంతాలలోనో ఆహారం, నీళ్ళు లేకుండా మగ్గుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ దళాలు యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు చేస్తున్నాయి. నీటమునిగిన ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార, నిత్యావసరాల ప్యాకెట్లు అందించటం చేస్తున్నారు. తమ ఫోర్స్‌కు చెందిన 29 బృందాలు, 100 పడవలు ప్రస్తుతం చెన్నైలో సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ చెప్పారు. 30 టన్నుల సహాయక సామాగ్రిని అరక్కోణం పంపిస్తామని తెలిపారు.
ఇదిలాఉంటే, అనేక వ్యాపార సంస్థలు చెన్నై ప్రజలకు ఉచిత సేవలను అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఓడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికామ్ సంస్థలు ఉచిత టాక్ టైమ్, ఉచిత డేటాను ఇస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, హెల్త్ కేర్ రంగానికి చెందిన ప్రాక్టో, ఓలా క్యాబ్స్, హోటల్ రంగానికి చెందిన ఓయో రూమ్స్, స్టేజిల్లా, మొబైల్ వ్యాలెట్ సంస్థ పేటీఎమ్, సర్వీసెస్ రంగానికి చెందిన అర్బన్‌క్లాప్ సంస్థలు తమ తమ స్థాయిలలో ఉచిత సేవలను అందిస్తున్నాయి.