హైదరాబాద్: కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఖండించారు. పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసింది నిజమేనని, అధికారపార్టీవారు ఆహ్వానించటం సహజమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించటానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలలో అడ్హాక్ కమిటీలు వేసి, ప్రజల్లో గుర్తింపు ఉన్న స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేస్తామని అన్నారు. పార్టీని వీడబోనని దానం నిన్నే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి స్పష్టీకరించినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ ఇవాళ గాంధీభవన్లో సమావేశమయింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు ఉత్తమ్ మీడియాకు తెలిపారు.