వచ్చే నెలాఖరులో జి.హెచ్.ఎం.సి.ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడంకోసం గత ఎడాది కాలంగా అధికార తెరాస అనేక సన్నాహాలు చేసుకొంది. కానీ అసలయిన సన్నాహాలు ఇపుడే మొదలుపెట్టింది. జంటనగరాలలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీల నేతలను తెరాసలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనబడుతున్నాయి. తెదేపా ఎమ్మెల్యే సాయన్న పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. ఆయనతో బాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్.ఎస్ ప్రభాకర్ కూడా తెరాసలో చేరిపోయారు.
బీజేపీ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా తెరాసలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి వచ్చేరు. ఈరోజు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న కీలక సమావేశానికి డుమ్మా కొట్టి తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. అధికార పార్టీ నుండి తనకు ఆఫర్లు రావడం సహజమేనని కానీ అంత మాత్రాన్న పార్టీని వీడిపోతున్నట్లు తనపై దుష్ప్రచారం చేయడం తగదని చెపుతున్నారు. తను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెపుతున్నారు కానీ అదే సమయంలో తన భవిష్యత్ కార్యకర్తల చేతిలో ఉందని వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతున్నారు. ఆయన మాటలు, వ్యవహార శైలి చూస్తుంటే త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు అర్ధమవుతోంది. మరో మాజీ మంత్రి గీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె తక్షణమే వాటిని ఖండించారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా?
రాజకీయ పార్టీలు ఇతర పార్టీలలో నేతలని ఆకర్షించడం ద్వారా బలపడాలనుకోవడం పెద్ద విచిత్రమయిన విషయమేమీ కాదు. కానీ తెలంగాణాలో తనకు ఎదురులేదని ఘంటాపథంగా చెపుతున్న తెరాస జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేందుకు ఇతర పార్టీల నేతలను రప్పించుకోవలసిన దుస్థితిలో ఉండటమే విచిత్రం. ఒకప్పుడు తెరాస అంటే ఉద్యమ పార్టీ తెలంగాణా సాధన కోసం పోరాడేవారితో నిండి ఉండేది. కానీ అదిప్పుడు తెదేపా, కాంగ్రెస్ నేతలతో నిండిపోయింది. ఇంత కాలం ఏ కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకొన్నాయని తెరాస వాదిస్తోందో ఇప్పుడు అదే పార్టీల నుండి నేతలను తెచ్చుకొని వారికి అధికారం కట్టబెడుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ తన పార్టీ నేతలను పక్కనపెట్టి బయట నుండి నేతలను తెచ్చుకొంటున్నారని అర్ధమవుతోంది. కానీ దాని వలన ‘ఇంటి పార్టీ’ అని చెప్పుకొనే తెరాస ఒక సంకర పార్టీగా మారిపోతోంది. పదవులు చేపట్టేందుకు బయట నుండి కొత్తగా వచ్చిన వారు తప్ప తామెవరం అర్హులుకామా? అని తెరాస నేతలు ప్రశ్నిస్తే ఆశ్చర్యమేమీ లేదు.