మొన్న డిశంబర్ 1వ తేదీన కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్డియో నగరంలో మానసిక రోగులకు చికిత్స అందించే ఇన్ ల్యాండ్ రీజియనల్ సెంటర్ పై జరిగిన దాడిలో 14 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. పోలీసుల విచారణలో చాలా ఆసక్తికరమయిన విషయాలు బయటపడ్డాయి. దాడికి పాల్పడినవారిలో సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ (28) అమెరికా పౌరుడు. అతను ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతని భార్య తష్ఫీన్ మాలిక్ (27) పాకిస్తానీ పౌరురాలు. వారికి ఒక చిన్న పాప కూడా ఉంది. అతను కొన్ని నెలల క్రితమే పాకిస్తాన్ వెళ్లి వచ్చేడు. ఆ తరువాత నుండి అతని వ్యవహార శైలిలో చాలా తేడా వచ్చిందని అతని సాటి ఉద్యోగులు తెలిపారు. అతని భార్య పాకిస్తాన్ నుండి సౌదీ అరేబియా వెళ్లి అక్కడి నుండి అమెరికాకు వచ్చింది.
రీజియనల్ సెంటర్ లో జరుగుతున్న క్రిస్మస్ పార్టీకి అతను కూడా హాజరయ్యాడు. కొద్ది సేపటికే అక్కడి ఉద్యోగులతో ఏదో విషయంపై గొడవపడి పార్టీ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయి, కొద్ది సేపు తరువాత మళ్ళీ తన భార్యతో కలిసి వచ్చి తమ వెంట తెచ్చుకొన్న మారణాయుధాలు పార్టీలో పాల్గొంటున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరపడానికి వచ్చినపుడు వారిరువురు వేరే రకమయిన దుస్తులు ధరించి వచ్చేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అవి సాధారణంగా ఉగ్రవాదులు ధరించే దుస్తులను పోలి ఉన్నాయని తెలిపారు. వారిరువురూ కాల్పులు జరిపి పారిపోతుంటే పోలీసులు వారిని వెంటాడి కాల్చి చంపారు.
పోలీసుల దర్యాప్తులో సయ్యద్ రిజ్వాన్ ఫరూక్, అతని భార్య గురించి ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ మత చాందసవాదిగా ఒక్క రోజులో మారలేడు. అతనిలో చాలా కాలంగా ఇటువంటి ఆలోచనలు కలిగే ఉండాలి. బహుశః అందుకే తన భావజాలానికి దగ్గరగా ఉన్న పాకిస్తాన్ యువతి తష్ఫీన్ మాలిక్ ని పెళ్లి చేసుకొని ఉండవచ్చును. అతను పాకిస్తాన్ వెళ్లి వచ్చిన తరువాత అతని వ్యవహార శైలిలో స్పష్టమయిన మార్పులు కనబడినప్పుడే అతనిపై అధికారులు అతని గురించి పోలీసులకు సమాచారం అందించి ఉండి ఉంటే బహుశః ఈ ఘాతుకం జరిగి ఉండేది కాదు. కానీ వారు అశ్రద్ధ కారణంగా 14 నిండు ప్రాణాలు బలయిపోయాయి.