ఇంతకు ముందు ప్రపంచాన్ని గడగడలాడించిన తాలిబాన్ ఉగ్రవాదులు, వారి అధినేత ఒసామా బిన్ లాడెన్ అమెరికా సేనల చేతిలో హతమయిన తరువాత క్రమంగా వారి ప్రాబల్యం కోల్పోయారు. వారిలో ఆధిపత్య పోరు మొదలవడంతో ముఠాలుగా విడిపోయి వారిలో వారే కలహించుకోవడం మొదలుపెట్టారు. తాలిబాన్ల కామాండర్ గా చెప్పుకొనే ముల్లా అక్తర్ మన్సూర్ ఇటీవల వారి మధ్య జరిగిన ముఠా కాల్పులలో తీవ్రంగా గాయపడి, కొన్ని రోజుల తరువాత మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ అధికారులు దృవీకరించారు. ఇంతవరకు అతని నేతృత్వంలో పనిచేస్తున్న తాలిబాన్లలో మళ్ళీ మరో చీలిక ఏర్పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం వారిలో వారు కలహించుకొంటున్నంత కాలం వారి గురించి ఆలోచించనవసరం లేదు. కనుకనే అగ్రరాజ్యాలు ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులను నిర్మూలించడం పైనే ఎక్కువ దృష్టి పెట్టి సిరియాలో వారి స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ శత్రుశేషం, రుణశేషం మిగల్చకూడదని పెద్దలు చెపుతుంటారు. కనుక తాలిబాన్లు బలహీనంగా ఉన్నప్పుడే అగ్రరాజ్యాలు వారి పనిపడితే మంచిదేమో?