హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హిందూ స్వామీజీలకు ఒక వింత సవాల్ విసిరారు. స్వామీజీలకు దమ్ముంటే పెళ్ళి చేసుకుని ఒక్క బిడ్డనైనా పుట్టించాలని అన్నారు. ముస్లిమ్ జనాభా పెరిగిపోతోందని ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని సంస్థలు ఆందోళన వ్యక్తం చేయటంపై స్పందిస్తూ అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6వ తేదీని పురస్కరించుకుని హైదరాబాద్ దారుస్సలామ్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో అసద్ మజ్లిస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కుట్ర జరుగుతోందని, అందుకే ముస్లిమ్ జనాభా పెరిగిపోతోందని హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. నరేంద్రమోడి ప్రభుత్వం ప్రజలను రక్షించటంకన్నా గోవులను రక్షించటానికే ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరు ఏమి తినాలో నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదని అసద్ అన్నారు. పప్పు ధరలకన్నా మాంసం ధరలే తక్కువగా ఉన్నాయని, అందుకే నిరుపేదలు బీఫ్ తింటున్నారని చెప్పారు.
దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్రంలోని మోడి సర్కార్ పట్టించుకోవటంలేదని అసద్ ఆరోపించారు. మోడి కేవలం ప్రపంచ పర్యటనలలో తేలియాడుతున్నారని అన్నారు. హిందూస్థాన్ హిందువులది, ముస్లిమ్‌లు పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలి అంటూ అసోమ్ గవర్నర్ వ్యాఖ్యానించటాన్ని తప్పుబట్టారు. దేశం అందరిదీ అని, అలాంటప్పుడు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్ళాలని అడిగారు. ఐఎస్ఐఎస్తో ఇస్లామ్‌కు సంబంధం లేదని అన్నారు. ముస్లిమ్‌లు సహనం ప్రదర్శించేందుకు బహిరంగంగా పందిమాంసం తిని చూపించాలని త్రిపుర గవర్నర్ వ్యాఖ్యానించారని, హిందువులు సహనం చూపించేందుకు కళ్యాణి బిర్యానీ తినాల్సి ఉంటుందని తాను అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆముదం తాగించి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళపాటు ముస్లిమ్‌లను మోసం చేసింది కాక నిజాంను దక్కన్ ద్రోహిగా అభివర్ణించిందని ఆరోపించారు. నిజాం సేవలు మరిచిపోయి తప్పుడు ప్రచారం చేయటం సహించరానిదని అన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందని ఆరోపించారు. బీజేపీ తొలి ప్రధాని వాజ్‌పేయి కాదని పీవీ నరసింహారావు అని అసదుద్దీన్ విమర్శించారు.