హైదరాబాద్: అవును! ఉందనే అంటున్నారు… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారని, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖకు అదనంగా ఈ శాఖను అప్పగించినట్లు కనిపిస్తోందంని గుత్తా వ్యంగ్యోక్తులు విసిరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేశామన్న కేసీఆర్, ఇప్పుడు క్యాంప్ రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. వలసలు ప్రోత్సహిస్తూ ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలల్లో కలిసొచ్చే ప్రతిపక్ష, వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని గుత్తా అన్నారు.