హైదరాబాద్: సినిమా హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే అసెంబ్లి ఎన్నికల నాటికి ఒక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించనున్నారా? త్వరలో జరుగనున్న హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారా? పవన్ కల్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చిన వెంటనే మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను విశ్లేషిస్తే అనేక విశేషాలకు దారులు తెరచుకుంటాయి. తన బలం, బలహీనతలు ఆయనకు స్పష్టంగా తెలుసని ఆయన మాటలను బట్టే అర్ధం కోవచ్చు. రాజకీయాల్లో రాణించాలంటే వ్యక్తిగత చరిష్మ ఒక్కటే సరిపోదని, సంస్ధాగత నిర్మాణం, సమర్ధ నిర్వహణ సామర్ధ్యం ఉండాలన్న పరమ సత్యాన్ని ఆయన గ్రహించారు. అలాగే ధన బలం కూడా ఉండాలని, ఆ బలం తన వద్ద లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అన్న చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యం పార్టీ ధనవంతులకు టికెట్లు అమ్ముకుని ఆర్ధికంగా లాభపడి రాజకీయంగా వెనుకబడిందన్న విమర్శల నేపధ్యంలో పవన్ ధనబలంపై చేసిన ప్రస్తావన విలువైనది. కేవలం ధన బలాన్నే గాక ప్రజా బలం కూడా ఉన్నవారిని అభ్యర్ధులుగా పెట్టుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రజారాజ్యంలో తానూ కీలక పాత్ర వహించినప్పటికీ పార్టీ నిర్వహణ, నిధుల సమీకరణ అల్లు అరవింద్ చేతుల్లోకి వెళ్ళిపోవడం, ప్రజారాజ్యాన్ని అరవింద్ ఒక సినిమా ప్రోడక్ట్ గా భావించి కలెక్షన్ల మీదనే దృష్టి పెట్టడం పవన్ కల్యాణ్ కు నచ్చలేదు. ఈ విషయాలన్నీ అన్న గారికి తెలుసు కాబట్టి, ఆయనకు చెప్పినా లాభం ఉండదని ఆయన ప్రజారాజ్యంలో మౌనంగా ఉండిపోయారు. తన అన్నయ్య సినిమాల్లో కమర్షియల్ గానీ, రాజకీయాల్లో సామ్యవాది అని, ప్రజాపక్షపాతిగా ఉంటారని పవన్ పెట్టుకున్న ఆశలు నీరుగారిపోవడం, ఆ షాక్ తో ఆయన చాలా కాలం తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించుకుంటూ మనసును కుదుట బరుచు కున్నారు. గో ఆధారిత వ్యవసాయంలో ‘ఎమరాల్డ్’ విజయరాం సలహాలను పాటిస్తున్నట్టే, రాజకీయంగా రామ్ మనోహర్ లోహియా వాదుల సూచనలను వింటున్నట్టు తెలిసింది. రామ్ మనోహర్ లోహియా భావజాలం, నాయకత్వం వల్లనే ఉత్తర ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పెత్తందార్ల పాలన అంతమై, బడుగు వర్గాలకు రాజకీయ అధికారం సంక్రమించినదన్న వాస్తవాన్ని పవన్ ఆకళింపు చేసుకున్నారు. తాజాగా బిహార్ ఎన్నికల్లోనూ సామాజికంగా బడుగు వర్గాలు సత్తా చూపాయి. రాష్ట్రంలో ధనిక, వ్యాపార వర్గాలకు దీటుగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలన్న దిశగా పవన్ అలోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. లోహియా భావజాలాన్ని, తన చరిష్మాను కలుపుకుని ఎన్ టీఆర్ అధికారంలోకి వచ్చినట్టే, తను కూడా అదే ఫార్ములాను అనుసరించడం సముచితంగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రవర్ణాల వారికి తక్కువ టికెట్లు ఇచ్చి సామాజికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉంది. ఎన్ టి ఆర్ ని హిట్ చేసిన ఈ సూపర్ హిట్ ఫార్ములాను అనుసరించడం సురక్షితమని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం.
సంస్ధాతగత నిర్మాణ వ్యూహకర్తల కోసం పవన్ కల్యాణ్ అన్వేషణలో ఉన్నారు. మొదట సంస్ధాగతంగా బలపడితే ఆ తర్వాత న్యాయ బద్ధంగా నిధులు సమకూర్చుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా, బిజెపి- టిడిపిలకు అలయెన్సుగా ముందుకు వెళ్తారా? తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటారా? ఆ క్రమంలో బిజిపిని కూడా లైట్ గా తీసుకుంటారా అన్నది ఇప్పుడే స్పష్టం కావడం కష్టం. తెలుగుదేశాన్ని పక్కన బెట్టి బిజెపితో జత కట్టడం ఒక ఫార్ములా అయితే, బిజెపిని తోసి రాజని లౌకిక శక్తులతో జతకట్టడం మరో ఫార్ములాగా ఆయనకు కన్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, వైఎస్సార్ సిపి లకు దీటుగా జనసేన ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి.