హైదరాబాద్: గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిసిన చెన్నై నగరంలో ఇవాళ మరో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవటంతో మియట్ ఆసుపత్రిలో ఈ ఉదయం 14మంది రోగులు చనిపోయారు. వీరంతా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న రోగులని, విద్యుత్ కొరత కారణంగా ఆక్సిజన్ సిలిండర్లు పనిచేయకపోవటంతో ఆక్సిజన్ అందక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 9మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరి మృతదేహాలను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మొత్తం 75మంది రోగులు ఐసీయూలో ఉండగా చనిపోయిన 14మంది వెంటిలేటర్‌పై ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే చనిపోయినవారి సంఖ్య 20 దాకా ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మియట్ ఆసుపత్రి మనపాక్కమ్ ప్రాంతంలో అడయార్ నది ఒడ్డునే ఉంటుంది. ఇక నగరంలో మొత్తం అన్ని ఆసుపత్రులలో కూడా ఇలాంటి సమస్య వలన మొత్తం 45మంది చనిపోయారని చెబుతున్నారు.
మరోవైపు చెన్నైలో జనజీవనం ఇంకా దుర్భరంగానే ఉంది. అయితే వర్షాలు కురవకపోవటాన్నే నగర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. వరదనీరు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నా, ఇంకా పలు కాలనీలు నీటిలోనే మునిగిఉన్నాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సౌకర్యాలు, ఏటీఎమ్‌లు, నిత్యావసరాల సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగలేదు. మొబైల్ ఏటీఎమ్ వ్యాన్లను రంగంలోకి దించారు. తాగునీరు, పాలు, కూరగాయలు దొరకటం దుర్లభమైపోయింది. అరలీటర్ పాల ప్యాకెట్ వందరూపాయలు పలుకుతోంది. నగరంలో 30 విధులు నిర్వర్తిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశేష సేవలందిస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా బాధితులను ఆదుకోటానికి వీధుల్లోకొచ్చి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లోకల్ ట్రైన్, బస్ సర్వీసుల పునరుద్ధరణ జరగకపోవటంతో, మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి.