మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని విడిచి సోమవారం తెరాసలో చేరడానికి నిశ్చయించుకొన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆఖరి ప్రయత్నంగా షబ్బీర్ ఆలి తదితర సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే డిల్లీ నుండి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా దానం నాగేందర్ కి ఫోనేచేసి పార్టీ వీడవద్దని కోరారు. పార్టీలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే పార్టీ మారుతున్నానని దానం చెపినట్లు తెలుస్తోంది. ఆయన లేవనెత్తిన సమస్యలన్నిటినీ తను స్వయంగా పరిష్కరిస్తానని దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. దానితో దానం కొంచెం చల్లబడి పార్టీలో కొనసాగాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. తను పార్టీ మారడం లేదని కొద్ది సేపటి క్రితమే ఆయన ప్రకటించారు.
ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి షాకులు ఇచ్చేరు. కానీ ఇప్పుడు తెరసకి షాక్ ఇచ్చేరు. ఇంతవరకు ఆయన తెరాసలో చేరుతారని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు నిరాశ చెంది ఉండవచ్చును. కానీ దానం నాగేందర్ ని పార్టీలోకి రప్పించేందుకు వారు తమ ప్రయత్నాలు కొనసాగించవచ్చును. తనకు హైదరాబాద్ మేయర్ పదవి ఇవ్వాలని దానం నాగేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన వలన పార్టీకి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో లాభం కలుగుతుందని తెరాస భావించినట్లయితే ఆయనకు మేయర్ పదవిని ఆఫర్ చేసినట్లయితే దానం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వవచ్చును. ఎన్నికలకి ఇంకా నెల రోజులు పైనే సమయం ఉంది కనుక ఈలోగా ఏమయినా జరుగవచ్చును.
తెరాస ఈవిధంగా వలసలు ప్రోత్సహించడంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో ‘ఆపరేషన్ ఆకర్ష’ అనే మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసుకొని దానికి జగదీశ్వర్ రెడ్డిని మంత్రిగా నియమించుకొంటే బాగుంటుందని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్, తెదేపాలు ఎంత విమర్శిస్తున్న తెరాస మాత్రం జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఆ రెండు పార్టీలలో నేతలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఎన్నికలకు ఇంకా నెలరోజులు సమయం ఉంది కనుక ఈ నెలరోజుల్లో ఇంకా ఎంతమంది కాంగ్రెస్, తెదేపా నేతలు పార్టీని వీడి తెరాసలోకి వెళ్లిపోతారో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.