హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశమంతా అబ్బురపడేలా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. కేటీఆర్ ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధివల్లే రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగుతోందని కేటీఆర్ అన్నారు. గతంలో ఎండాకాలం వస్తే ఎడాపెడా కరెంట్ కోతలు ఉండేవని, ఒక్కో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవాళ్ళు జనరేటర్‌లు నడపటంకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేవారని అన్నారు. కానీ ఇవాళ జనరేటర్లు, ఇన్వర్టర్ల బిజినెస్ పడిపోయిందని చెప్పారు. ప్రజలకు లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం వచ్చిందన్నారు.
సీఎమ్ ప్రణాళిక చాలా పెద్దగా ఉందని, ఆయన హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర భద్రతను లక్ష సీసీ టీవీ కెమేరాల ద్వారా కట్టుదిట్టం చేయబోతున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నిరాదరణకు గురైందని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చటానికి సరైన జలాశయం ఒక్కటికూడా నిర్మించలేదని, వారికి ముందు చూపులేకపోవటంవల్లే ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. నగర మంచినీటి అవసరాలు తీర్చేందుకు 30 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంవల్ల, ముఖ్యమంత్రి పట్టుదల వల్ల గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తీసుకురాగలిగామని అన్నారు. ఇంకో నాలుగైదు రోజులలో శివారు ప్రాంతాలలో, నగరంలో తాగునీటి సమస్యలు తొలగిపోతాయని చెప్పారు