బస్టాండులో టీ అమ్ముకొన్న వ్యక్తి ప్రధాన మంత్రి అవగాలేనిది జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, రబ్రీ దేవి, లాల్ కృష్ణ అద్వానీ, చిదంబరం, నితీష్ కుమార్, ములాయం సింగ్, శరత్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ ప్రసాద్ యాదవ్ తదితరులు అవ్వాలనుకొంటే తప్పా? కాదు. కనుక అందరూ ఏదో ఒకరోజు ప్రధాని కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలాలని అనుకొంటున్నారు. కానీ దేశంలో ఒక్కటే ప్రధానమంత్రి కుర్చీ ఉండటం, అది కూడా ఐదేళ్ళకోసారి మాత్రమే ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం! ఈ జాబితాలో ఇంకా మిగిలినవారి పేర్లు కూడా వ్రాసినట్లయితే అది చిన్న సైజు పుస్తకం అవుతుంది కనుక వీలుపడటం లేదు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇవ్వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేరు. “రాహుల్ గాంధీ నాకు మంచి స్నేహితుడు. ఒకవేళ కాంగ్రెస్ మా ‘నేతాజీ’ని అంటే మా నాన్నగారు ములాయం సింగ్ యాదవ్ ని ప్రధానమంత్రి చేయడానికి అంగీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులకి నేను ఇప్పుడే ఒకే చెప్పేస్తాను,” అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అంతేకాదు రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ ఒక మంచి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేరు. అదేమిటంటే ఆయనకి ఉప ప్రధాన మంత్రి పదవి ఇస్తారుట. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ క్రింద పనిచేయడానికి రాహుల్ గాంధీ ఇష్టపడితే, తక్షణమే కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి మాట్లాడుకొందామని అన్నారు.
లోక్ సభ ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2016లో జరుగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ అండ లేకుండా తనంతట తానుగా గెలిచే అవకాశం లేదు. కనుక అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఇస్తున్న ఈ ఆఫర్ గురించి ఆలోచించడం మంచిదే.
“బిహార్ లో లాగ మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకొంటున్నారా?” అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల బలంతోనే మేము అవలీలగా అసెంబ్లీ ఎన్నికలలో గెలవగాలమని దృడంగా నమ్ముతున్నాము,” అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వం వహిస్తున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించేశారు. కానీ పొత్తుల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు.