కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రైల్వే చార్జీలు పెంచినపుడు ప్రధాని నరేంద్ర మోడిపై అపార విశ్వాసంతో ఉన్న దేశ ప్రజలు దానిని పెద్దగా వ్యతిరేకించలేదు. ఆయన గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ మళ్ళీ గాడిన పెడుతున్నారని, ఆ ప్రయత్నంలోనే రైల్వే చార్జీలు పెంచవలసి వచ్చిందని ప్రజలే సర్ది చెప్పుకొన్నారు. కానీ అట్టడుగు స్థాయి నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడి సామాన్యుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాలలో చక్కర్లు కొడుతుంటే, రైల్వేశాఖ ఎడాపెడా చార్జీలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. గత 18 నెలలో సగటున ప్రతీ నాలుగు నెలలకు ఏదో ఒక రూపంలో ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది.
ఆన్ లైన్ లో బుక్ చేసుకొన్న టికెట్లను రద్దు చేసుకోవడం కంటే ఆ టికెట్లను పూర్తిగా వదులుకోవడమే మేలు అన్నంతగా రద్దు చార్జీలను పెంచేసింది. తత్కాల్ విధానంలో ప్రీమియం తత్కాల్, రైల్వే టికెట్ల వేలం పాట వంటి రకరకాల ఐడియాలతో ప్రజలను దోచుకొంటూనే ఉంది. చివరికి ప్లాట్ ఫారం టికెట్లను కూడా వదిలిపెట్టకుండా ఏకంగా రూ.10 చేసేసింది. మొన్న దసరా, దీపావళి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు అతితెలివి ప్రదర్శిస్తూ ప్లాట్ ఫారం టికెట్ చార్జీలను ఏకంగా రూ.20 చేసేసి ప్రజల నుండి డబ్బులు పిండేసుకొన్నారు.
ఇప్పుడు రైల్వే శాఖ మళ్ళీ మరో బాదుడుకి సిద్దమయింది. 5-12 సం.ల వయసు గల పిల్లలకు ఇంతవరకు రిజర్వేషన్ టికెట్స్ పై ఇస్తున్న కొద్దిపాటి రాయితీని రద్దు చేసి, వారికి కూడా పెద్దవారితో సమానంగా పూర్తి టికెట్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయం ఏప్రిల్, 2016 నుండి అమలులోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఎలాగు ప్రయాణికుల నడ్డి విరిచేందుకు సిద్దమయినపుడు ఇంకా అంత కాలం ఎందుకు ఆగుతోందో తెలియదు. బహుశః మధ్యలో ఇంకో బాదుడు ఉందేమో?