అత్యంత విలువైన కోహినూర్ వజ్రం హక్కుదారు ఎవరో త్వరలో తేలిపోతుందా ? మొన్న ఇండియా, ఇవాళ పాకిస్తాన్ ఈ వజ్రాన్ని న్యాయపరంగా బ్రిటన్ దగ్గర నుంచి రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. శతాబ్దాల చరిత్రకలిగిన కోహినూర్ వజ్రానికి నిజమైన హక్కుదారులెవరు? బ్రిటీష్ రాణి చెంతకు చేరడానికి ముందు చివరిగా ఎవరి చేతుల్లో ఉంటే వారే హక్కుదారులనుకోవాలా ? లేక ఎక్కువ కాలం ఏ భూభాగంలో ఈ వజ్రం చేతులుమారుతూ తిరిగిందో ఆ భూభాగానికే హక్కు ఉన్నదని చెప్పొచ్చా? కాదంటే యుద్ధ నష్టపరిహారంగా పుచ్చుకున్న ఆస్తిగా భావిస్తున్న దేశానికే సర్వహక్కులు ఉన్నట్లు గుర్తించాలా ? ఈ సమస్య న్యాయపరంగా తేలకపోవడం వల్లనే పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లండ్ విభిన్నవాదనలను వినిపిస్తున్నాయి. హక్కుదారు ఎవరన్నది న్యాయపరంగా తేలితే కోహినూర్ కథకు `శుభంకార్డు’ పడుతుందనే అనుకోవచ్చు.
పట్టుబట్టిన పాక్
కొహినూర్ వజ్రాన్ని వెనక్కి తెప్పించేందుకు ఒక పక్క ఇండియా ప్రయత్నిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. అప్పట్లో పంజాబ్ ప్రావెన్సీ పరిధిలోని లాహోర్ లో ఉన్న ఈ వజ్రం బ్రిటన్ కు చేరింది కాబట్టి దాన్ని తిరిగి లాహోర్ చేర్చాలంటూ పాకిస్తాన్ న్యాయపోరాటం ప్రారంభించింది. మహరాజా రన్ జీత్ సింగ్ మనవడు దలీప్ సింగ్ నుంచి ఈ వజ్రాన్ని లాక్కుని బ్రిటన్ కు తీసుకెళ్ళారని పాకిస్తాన్ అంటోంది. అలా తస్కరించబడిన వజ్రాన్ని రెండవ క్వీన్ ఎలిజిబత్ వద్దకు చేర్చారు. ఆపైన అది ఆమె కిరీటంలో ఒదిగిపోయింది. ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఉంది. 1849లో బ్రిటీష్ సేనలు పంజాబ్ ని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పంజాబ్ లోని వారసత్వ సంపదనంతా వాళ్ల స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. నాటి పంజాబ్ లో సిక్కు రాజ్యాన్ని వశంచేసుకున్నతర్వాత నష్టపరిహారంగా అనేక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ వజ్రం కూడా ఉంది. దీన్ని లాహోర్ లోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోశాగారంలో భద్రపరిచారు. అనేక మంది చేతులు మారినతర్వాత ఇది చివరకు క్వీన్ ఎలిజబెత్ చెంతకు చేరింది. లాహోర్ నుంచి చివరిసారిగా బ్రిటన్ చేరింది కనుక, ఈ విలువైన వజ్రం పాకిస్తాన్ కే చేరాలని లాహోర్ హైకోర్ట్ లో జావేద్ ఇక్బాల్ అనే న్యాయవాది పిటీషన్ దాఖలుచేశారు.
పుట్టినిల్లు భారత్
అయితే అంతకు ముందు కోహినూర్ వజ్రం ఇండియాలోని చాలా ప్రాంతాల్లో తిరిగింది. అనేకమంది చేతులుమారింది. కొన్ని శతాబ్దాల క్రిందట ఈ వజ్రం గుంటూరు జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో దొరికింది. నాటి కాకతీయ రాజులు ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఈ వజ్రాన్ని వారు హిందూ దేవతామూర్తి చెంతకు చేర్చారు. అపహరణకు గురికాకుండా ఉండేందుకు అమ్మవారి విగ్రహం ఒక కనుగుడ్డుగా ఈ వజ్రాన్ని పొదిగారట. అయినా ఇది అపహరణకు గురైంది. కాకతీయుల సామ్రాజ్యం కూలినతర్వాత అనేక విలువైన సంపదను స్వాధీనం చేసుకున్నట్లుగానే ఈ అపూర్వ వజ్రాన్ని సైతం ఢిల్లీ సుల్తానులు చేజిక్కించుకున్నారు.
పూర్వ యుగంలో..
కోహినూర్ కథ నిజానికి 800 శతాబ్దాల క్రిందటనే ప్రారంభంకాలేదు. అంతకంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందటే మొదలైంది. పురాణాల్లో ప్రస్తావించిన శమంతకమణి ఇదేనంటారు. సూర్యునిచేత సత్రాజిత్తునికి ఇవ్వబడిన మణి ఇదే. ప్రతిరోజూ ఇది ఎనిమిది బారువుల బంగారం ప్రసాదిస్తుండేదని పురాణాల్లో ఉండేది. నిజంగా బంగారం ఇవ్వకపోయినా, దాని విలువ రోజురోజుకీ అంతగా పెరిగిపోతుందని అన్వయించుకోవచ్చు. అలాంటి మణికోసం పురాణకాలంలోనే యుద్ధాలు జరిగాయి. మహాభారత యుద్ధానంతరం ఈ మణిజాడ ఎవ్వరికీ తెలియలేదు. యుగం మారిన తర్వాత శమంతకమణి గుంటూరు జిల్లాలో తవ్వకాల్లో బయటపడిందని అంటారు. దాని పేరు కోహినూర్ (కాంతి శిఖరం)గా మారినతర్వాత ఎంతోమంది చేతులు మారింది. దీనికోసం మరోసారి యుద్ధాలు తప్పలేదు. ఇది ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండలేదు.
నమ్మకాలు…
కోహినూర్ వజ్రం విషయంలో చాలాకాలంగా ఒక నమ్మకం ప్రచారంలోఉంది. దీన్ని స్త్రీలు ధరిస్తే వారు మహాశక్తిమంతులవుతారు. అదే పురుషులు ధరిస్తే మాత్రం వారికి అరిష్టం తప్పదు. ఈ వజ్రం ఎవరిదగ్గర ఉందో వారు యుద్ధాలు చేయకతప్పదన్న నమ్మకం కూడా ఉంది. ఇలాంటివే మరికొన్ని నమ్మకాలు కూడా ఈ వజ్రం చుట్టూ తిరగాడాయి. చరిత్రపుటలు తిరగేస్తే ఇది నిజమేననిపించకమానదు. పురాణంలో సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని తన కంఠంలో ధరించి వేటకు వెళ్ళి సింహంబారినపడి మరణించడాన్ని కూడా గుర్తుచేసుకోవాల్సిందే.
కాగా, కోహినూర్ వజ్రం తిరిగి భారతదేశంలోకి రావడమే కరెక్ట్ అని భారత ప్రభుత్వంసహా పలువురు భావిస్తున్నారు. ఈమధ్యనే బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు `మౌంటెన్ ఆప్ లైట్’ పేరిట ఒక గ్రూప్ గా ఏర్పడి లండన్ హైకోర్ట్ లో న్యాయపోరాటానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో పుట్టిన వజ్రం తిరిగి పుట్టింటికి చేరడమే న్యాయమన్నది వీరి వాదన.
ఇవ్వనంటున్న బ్రిటన్
బ్రిటీష్ మ్యూజియంలో భద్రంగా ఉన్న కోహినూర్ వజ్రాన్ని వదులుకోవడానికి ఇంగ్లండ్ ఇష్టపడటంలేదు. ఈ వజ్రాన్ని తాము దోచుకోలేదనీ, హక్కుగా పొందామని వాదిస్తోంది. అందుకే ఇండియా పాకిస్తాన్ సాగిస్తున్న న్యాయపోరాటాలను తిప్పికొట్టాలని భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ లో కోహినూర్ వజ్రం విలువ పదికోట్ల పౌండ్లు దాకా ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది. విలువ కోసం కాకపోయినప్పటికీ పరువుకోసం బ్రిటన్ ఈ వజ్రాన్ని అంత తొందరగా వదిలిపెట్టదన్నది వాస్తవం. ఇలా ఒక వజ్రంపై మూడుదేశాలు హక్కుకోసం న్యాయపోరాటం చేయాల్సి రావడం కూడా ఈ వజ్రం (శమంతకమణి/ కోహినూర్) మహిమేనేమో..
-కణ్వస