హైదరాబాద్: వందేళ్ళచరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురియటం కాదు చెన్నైకు అసలు సమస్య. కురిసిన వర్షం తాలూకు వరదనీరు పీల్చుకోబడకపోవటం, బయటకెళ్ళకపోవటమే పెద్ద సమస్యగా మారింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా ఇలాంటి ముప్పే ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనితో రాజధానికి అమరావతి ప్రాంతం ఎంపికపై చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.
చెన్నైలో మూడు నదులు, బకింగ్ హామ్ కాలువ ఉన్నప్పటికీ అవి నగరంలో కురిసిన వర్షం తాలూకు వరదనీటిని తీసుకోలేకపోయాయి. దీనికి కారణం కబ్జాలు, అడ్డదిడ్డంగా పెరిగిపోయిన నగరం. నిర్మాణం పూర్తయ్యే అమరావతిలో ఒక నది, కృష్ణా పశ్చిమ కాలువ ఉంటాయి. మన ప్రభుత్వాధినేతలు ఊహించినట్లు అమరావతి పెరిగిపోతే, అది ఒక్కరోజులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఆ నీటిని పీల్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు, నదికి పరిసరాలలో భూ గర్భంలో కొన్ని పాయలు(paleo channels) ప్రవహిస్తుంటాయని, ఆ పాయల ఉపరితలంలోని భూమిపై ఎలాంటి నిర్మాణాలు కట్టకూడదని సూచిస్తున్నారు. రాజధాని నిర్మాణంకోసం సేకరించిన 33,000 ఎకరాలలో అధికశాతం నేలకు అడుగున ఈ పాయలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే అమరావతిలో భారీ నిర్మాణాలు కట్టేముందు క్షుణ్ణంగా జియాలజిస్ట్లచేత పరీక్షలు చేయించాలని అంటున్నారు. అయితే ఏపీలో కంట్రాక్టర్ల లాబీ బాగా బలంగా ఉన్నందున భారీ నిర్మాణాలు కట్టకుండా ఆగే పరిస్థితి ఉండదనే వాదన వినిపిస్తోంది. ఇక, 33,000 ఎకరాలలో అత్యంత సారవంతమైన, మూడుపంటలు పండే పొలాలు, పచ్చదనం మాయమైపోవటంవలన తీవ్రమైన పర్యావరణ అసమతౌల్యం ఏర్పడుతుందనే వాదన ఎలాగూ ఉండనే ఉంది. మరి ఈ వాదనలకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందో వేచి చూడాలి.