హైదరాబాద్: ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 18 నెలల కాలంలో పూర్తిగా విఫలమయ్యాడని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నిన్న ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ఎంత విఫలమయ్యారో, జగన్ కూడా అంతే విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సంఖ్యాపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, 2004లో టీడీపీ, 1983, 85లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు అసెంబ్లీలో ఎంత బలం ఉండేదో ఇప్పుడు దానికి రెట్టింపు బలం వైసీపీకి ఉందని ఉండవల్లి చెప్పారు. ఓట్ల శాతం కూడా టీడీపీకి, వైసీపీకి తేడా 1.2 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. ఇంత బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా విఫలమవటం ఇప్పుడు చర్చనీయాంశమయిందని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షమైనా గట్టిగా పోరాడాలని, కానీ జగన్ అలా చేయటంలేదని వ్యాఖ్యానించారు. కేసుల భయంతోనే జగన్ విఫలమయ్యాడనే వాదన వినిపిస్తోందని చెప్పారు. కేసులు పెట్టేవరకే భయపడాలిగానీ, పాత కేసుల గురించి భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. అది కూడా రు.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఛార్జిషీట్లో పేర్కొనబడ్డ కేసు అని, దానిని ప్రత్యర్థులు లక్ష కోట్లుగా ప్రచారం చేస్తున్నా వైసీపీ నేతలు కౌంటర్ చేయటంలేదని చెప్పారు.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలనాటికి కూడా తనకూ, జగన్‌కే పోటీ ఉంటుందని, ప్రజలు తనవైపే మొగ్గు చూపుతారని చంద్రబాబు ధీమాగా ఉన్నారని చెప్పారు. మరోవైపు జగన్ కూడా అదే ధీమాతో ఉన్నారని, చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేకపోయారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఆయనకు కాకుండా తనకే ఓటేస్తారని అనుకుంటున్నారని ఉండవల్లి అన్నారు. వీరిద్దరి వలన రాష్ట్రం నష్టపోతోందని చెప్పారు. పవన్ లాంటి మూడో శక్తి రావాలని ఉండవల్లి కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. అలా పవన్ మూడో శక్తిగా రంగప్రవేశం చేస్తే ఉండవల్లి ఆయనతో చేరేటట్లుగాకూడా కనిపిస్తోంది.