ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్… పేరు ఏదైనా సీన్ ఒకటే. చెన్నై వరదలతో అపారనష్టం. ఆఫీసుల్లోకి నీరు చేరడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఉద్యోగులు ఆఫీసులకు చేరే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో వందల కోట్ల నష్టం తప్పలేదు. దీంతో మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు దాదాపు 10 మిలియన్ డాలర్లు, అంటే 65 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. బడా ఐటీ కంపెనీలకు దాదాపు 50 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 325 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ఆర్థికంగా నష్టాలే కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవడం, ముఖ్యమైన క్లయింట్లకు ఇబ్బంది రాకుండా చూడటం ఈ కంపెనీలకు కత్తిమీద సాముగా మారింది. అందుకే, బడా కంపెనీలు తమ ఉద్యోగులను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరుకు తరలించాయి. దాదాపు ప్రతి కంపెనీ దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే బెంగళూరుకు తరలించి, అక్కడి ఆఫీసుల నుంచి పనిచేయిస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి రోజూ ఈ కంపెనీల బస్సులు ఉద్యోగులను బెంగళూరుకు తరలిస్తూనే ఉన్నాయి.
ఆటో మొబైల్ పరిశ్రమకూ వరదల వల్ల నష్టాలు తప్పలేదు. ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు దాదాపు 15 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా భారీగా నష్టపోయాయని అసోచాం తెలిపింది. అశోక్ లేలాండ్, హ్యుండాయ్, రెనాల్ట్, నిసాన్ తదితర ఆటో మొబైల్ కంపెనీలు మూతపడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, కాబట్టి నష్టాలు పెరగవచ్చని ఈ కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
భారీ వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో 450 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి. పాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మంచి నీటి కోసం, తిండి కోసం జనం అల్లాడుతున్నారు. ప్రజల కష్టాలు అలా ఉంటే, కంపెనీల నష్టాలూ అపారమే అని అంచనాలు వేస్తున్నారు.